వృద్ధ మహిళ హత్య..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. కొత్తపేట గీతాంజలి స్కూల్ సమీపంలో నివాసం ఉన్న కొప్పరపు సావిత్రి (75) అనే మహిళ ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మహిళ చీర పైట కొంగుతో మెడకు చుట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని చోరీ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, నరసరావుపేట డిఎస్పి కె. నాగేశ్వరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతురాలు భర్త గత కరోనా సమయంలో మరణించగా, మృతురాలు సావిత్రి అద్దె ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నది. సమీపంలోనే కూతురు, అల్లుడు, పిల్లలతో నివాసముంటున్నారు. మృతురాలు అల్లుడు టంగుటూరు వీరబ్రహ్మం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, మృతురాలికి తెలిసినవారే నగల కోసం ఈ హత్య చేసి ఉండొచ్చని వీరబ్రహ్మం అనుమానం వ్యక్తం చేస్తున్నాడు…. బెంబేలెత్తుతున్న ఒంటరి మహిళలు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళ సావిత్రి హత్యతో పట్టణంలో పలు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు భయం గుప్పెట్లో ఉన్నారు. కాగా గత ఏడాది ఇదే తరహాలో సమీపంలోనే ఓ వృద్ధ మహిళను ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్య చేసి ఒంటిపై నగలను దోచుకుని వెళ్ళాడు. ఆ కేసు నేటి వరకు పురోగతి సాధించినట్లు లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. (Story : వృద్ధ మహిళ హత్య..)