పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటల్ అధికారులకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికీ అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో మొత్తం 6,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష హాలులోకి సెల్ ఫోన్లను ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించవద్దని తెలిపారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్ సూపరింటెండెంట్లదే ప్రధాన బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏసీజీ గణేష్, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి)