ఘనంగా, సోభాయమానంగా సాగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారు కొలువైన వినుకొండ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. కూటమి నాయకులు నిస్శంకర శ్రీనివాసరావు, రాయల నాగ శ్రీనివాస్ మేడమ్ రమేష్ తదితర పట్టణ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ. ప్రజల సుఖశాంతులు, నియోజకవర్గ అభివృద్ధి, ఆధ్యాత్మిక వైభవం లక్ష్యంగా శ్రీ రామలింగేశ్వరుని ఆశీస్సులకై గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొండ పవిత్రత, శక్తి మరింత పెంపు చేసే విధంగా.. ప్రజల అభీష్టం మేరకు, యిక ఈ గిరి ప్రదక్షిణ ప్రతినెలా పౌర్ణమి రోజు ఉదయం నగర సంకీర్తన వలె, నడక మార్గంలో నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు నిశంకర శ్రీనివాసరావు, కొంజేటి నాగ రాయల శ్రీను, నాయకులు మేడం రమేష్ లు మాట్లాడుతూ. శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు , పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి, సహకారంతో వినుకొండపై ఒక అద్భుత దేవాలయం, ఘాట్ రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు గొప్ప ప్రణాళికతో పూర్తయి, వినుకొండ అభివృద్ధి పథంలో పయనించనున్నదని అన్నారు. కొండమెట్ల వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ ర్యాలీ, వాయిద్యం, భజనలు, భక్తి పాటలు, దైవ నినాదాలతో కొండ చుట్టూ తిరిగి మరల కొండమెట్ల వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గుడి వద్ద, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో ముగిసింది. పెద్ద ఎత్తున పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story ; ఘనంగా, సోభాయమానంగా సాగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం)