ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అసెంబ్లీ, స్పీకర్ ఇవ్వలేరు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో మాట్లాడిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు/ వినుకొండ :వైకాపాకు ప్రజలే తిరస్కరించిన ప్రతిపక్ష హోదాను అసెంబ్లీగానీ, స్పీకర్ గానీ ఇవ్వలేరని జగన్ ఇక నైనా గుర్తించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హితవు పలికారు. అది మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యత, సంస్కారం వదిలి పెట్టి ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారని అది కనీసం వినకుండా వ్యవహరించారని మండిపడ్డారు. జగన్, వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా సభకు రాకపోతే పదవిపోతుందనే వచ్చారు తప్ప ప్రజలపట్ల గౌరవం ఉండి కాదని చురకలు వేశారు. ప్రజాసమస్యల పట్ల జగన్‌కు, వైకాపా ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతోందన్న చీఫ్‌విప్ జీవీ వాళ్ల ను ఇలానే వదిలేస్తే ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా సభకు రావాలని డిమాండ్ పెడతారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలు తెలియనివారు ప్రతిపక్ష హోదా అడగడం దురదృష్టకరం. ప్రజలు 11 మందిని గెలిపిస్తే సభలో 11 నిమిషాలు మాట్లాడలేక పోయిన వాళ్లను చూసి ఆ 11 మందినైనా ఎందుకు గెలిపించామని ప్రజలు బాధ పడుతున్నారన్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లుగా మిగిల్చిన గుంతలను 8 నెలల్లోనే పూడ్చి గుంతల్లేని రాష్ట్రంగా చంద్ర బాబు తీర్చిదిద్దారన్నారు. ఒక్కసంతకంతో పింఛన్లు పెంచారని, సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్‌ను అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారని, బడ్జెట్ నిధులన్నీ ఏం చేశారో తెలియని దుస్థితిలోకి నెట్టారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంలో అమరావతి, పోలవరాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారన్నారు. పల్లె సీమల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని, నిధులు ఇస్తున్నారని తెలిపారు. దావోస్ సదస్సులు సహా వివిధ ప్రయత్నాల ద్వారా రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబో తున్నారని తెలిపారు. ఉచిత ఇసుక, మద్యం విధానం సంస్కరణ ద్వారా కూటమి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిందన్నారు. విద్యుత్ ఛార్జీలు కూడా గ్రీన్ పవర్ ద్వారా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి పెట్టారని, 2047 కి స్వర్ణాంధ్ర ప్రదేశ్, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజలు మరో 20 ఏళ్లు కూటమిని కొనసాగిస్తే ఏపీ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలవడం ఖాయమన్నారు.(Story : ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అసెంబ్లీ, స్పీకర్ ఇవ్వలేరు)