అత్యధికంగా పామాయిల్ సాగుని పెంచాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశంలో ఉన్న మంచి నూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేస్తాయికి ఎదిగేందుకు అత్యధికంగా పామాయిల్ సాగుని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించి దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డి పల్లి గ్రామంలో ప్రీయునిక్ సంస్థ ద్వారా నిర్మించనున్న పాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా పామాయిల్ రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు వంట నూనె ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని తద్వారా మన ఫారెన్ నిల్వలు ఇతర దేశాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. దేశంలో వంతనునెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పెట్టుబడి తో అత్యధిక లాభం పొందే పంట పామాయిల్ పంట మాత్రమే అని అన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం ద్వారా ఎకరాకు 51 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. మొక్కల పంపిణితో మొదలుకొని డ్రిప్, 4 సంవత్సరాల వరకు అంతర్ పంట సబ్సిడీ కింది ఎకరాకు 4200 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఆయిల్ పామ్ కంపెనీ వారు రైతులతో ఒప్పందం చేసుకుని పంట చేతికి వచ్చాక నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం పామాయిల్ గెలలు మార్కెట్ లో టన్నుకు 20,487 రూపాయల ధర పలుకుతుందనీ త్వరలోనే 25 వేలకు చేరుకుంటుందని తెలియజేశారు.
ఇప్పుడు భూమి పూజ చేస్తున్న పామాయిల్ కంపెనీ. ఆగష్టు 15 నాటికి ప్రారంభోత్సవం చేస్తామని అదేవిధంగా బీచ్ పల్లి వద్ద ఉన్న వేరు సెనగ ఆయిల్ కంపెనీని మరమ్మతులు చేసి పామాయిల్ కంపెనీగా ఇదే సంవత్సరంలో ప్రారంభించుకుంటామని భరోసా ఇచ్చారు.
రైతులు రాష్ట్రంలో అత్యధికంగా పామాయిల్ సాగు చేపట్టాలని రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేయించి ప్రతి జిల్లాకు ఒక పామాయిల్ కంపెనీ స్థాపించడం ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. రైతులు పంట మార్పిడి వైపు అలోంచించాలని వనపర్తి జిల్లాలో 11 వేల ఎకరాల్లో సాగుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. పామాయిల్ సాగులో భారత దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలని తెలిపారు. దేవరకద్ర శాసన సభ్యులు, వనపర్తి శాసన సభ్యులు అడిగిన అన్ని అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అదనపు కలక్టర్ రెవెన్యూ జి . వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం , వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మార్కెట్ యార్డు చైర్మన్ ప్రశాంత్, పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. (Story : అత్యధికంగా పామాయిల్ సాగుని పెంచాలి)