ఆరేళ్ల బాలుని మృతదేహం..కలకలం!
న్యూస్‌తెలుగు/విజయవాడ: విజయవాడ నగరంలో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గొల్లపూడి పంటకాల్వ రోడ్డులోని డంప్ హౌస్ వద్ద నీటిలో ఓ బాలుని మృతదేహం బయటపడింది. ఆ బాలుని వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. గత రాత్రి నీటిలో తేలియాడిన భౌతికకాయాన్ని అక్కడే ఉంటున్న ముగ్గరు వ్యక్తులు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం భవానీపురం పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసి, పంచనామాకు తరలించారు. బాలుడిని గుర్తించవలసిందిగా ప్రకటన జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఆ బాలుడు ఎవరి తాలూకా అన్నది ఇంకా తేలలేదు. విజయవాడ పరిధిలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనూ బాలుర మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో ఈ ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ బాలుడు విజయవాడకు చెందిన వ్యక్తి కానప్పుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు అతను ప్రాణాలు కోల్పోయాడా? లేక హత్య గావించబడ్డాడా? అన్న కోణంలోని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు అంతుచిక్కని ఈ బాలుడి మృతదేహం గురించి తెలిసిన వారెవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. (Story: ఆరేళ్ల బాలుని మృతదేహం..కలకలం!)