మున్సిపల్ కార్మికుల సమస్యలపై దశల వారీ ఆందోళన
న్యూస్‌తెలుగు/వినుకొండ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్లకు కార్మికుల సమస్యల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వినుకొండలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోసు కి వినతిపత్రం సమర్పిస్తున్న సందర్భంగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏ ఐ టి యు సి) ఈ కార్యక్రమాలు నిర్ణయించి జరుపుతున్నామని సోమవారం మున్సిపాలిటీ కమిషనర్లకు కార్మికులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్యక్రమాలలో మున్సిపాలిటీ లోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల చెల్లింపు బాధ్యత మున్సిపల్ శాఖ నిర్వహించాలని, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు డిఏలు, సత్వరం విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకై గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని, మున్సిపాలిటీలలో జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలని, ఇంజనీరింగ్ ఒప్పంద సిబ్బంది కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కె. మల్లికార్జున, యూనియన్ నాయకులు శ్రీనివాస్, అబ్రహం రాజు, సాయిబాబు, పచ్చి గొర్ల ఏసు, ఏసు పాదం, తదితరులు పాల్గొన్నారు. (Story: మున్సిపల్ కార్మికుల సమస్యలపై దశల వారీ ఆందోళన)