మాట, చేతల అదుపులో ఆధ్యాత్మికతను మించినమార్గం లేదు
శ్రీ గంగా గౌరీ సమేత కైలాశేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇతరులకు మనం చేసిన మంచి, చెడు కర్మరూపంలో తిరిగి వస్తుంటాయని, మాట, చేతలను అదుపులో ఉంచుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన మార్గం మరొకటి లేదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఎప్పుడు, ఎక్కడ చేసిన వాటికి అప్పుడు, అక్కడే అనుభవించాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవడం, పాపభీతి, దైవ చింతన ఉంటే జీవితంలో ఇబ్బందులు తప్పుతాయన్నారు. వినుకొండ శ్రీనివాస నగర్ లో శ్రీ పరివార దేవతాసహిత గంగా, గౌరీ, సమేత కైలాశేశ్వర స్వామి, కాలభైరవ, వినాయకుడు, అయ్యప్పస్వామి, కుమార స్వామి అభయాంజనేయస్వామి వార్ల జీవ ధ్వజ స్ధిర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన జీవీ ఆంజనేయులుకు అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనం తరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, భక్తులకు మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అన్నారు. ప్రతిఒక్కరిలో దేవుడి పట్ల భక్తి, చెడు పట్ల భయం ఉండడం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి యజ్ఞానికి అందరి దేవుళ్ల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని చూస్తున్న దుష్టశక్తుల అడ్రెస్‌లు త్వరలోనే పూర్తిగా గల్లంతు కావడం ఖాయమని జీవీ ఆంజనేయులు తెలిపారు. (Story : మాట, చేతల అదుపులో ఆధ్యాత్మికతను మించినమార్గం లేదు)