రైతులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్
బడ్జెట్ కాపీలు దగ్థం
న్యూస్‌తెలుగు/విజయవాడ: ఆర్థిక అభివృద్ధికి కీలకమైన వాటిల్లో వ్యవసాయరంగం ఒకటి. ఆహార భద్రత లక్ష్యంతో సులభంగా రుణాలు అందించేలా వ్యవసాయ రంగంలో నిరుద్యోగితను పరిష్కరించేలా, వలసలు తగ్గించేందుకు, సాంకేతికతను మరింత అందుబాటులోకి తెచ్చేలా బడ్జెట్ ఉందని చెప్పారు. అంతే గాకుండా విత్తనం నుండి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టు బోతున్నామని చెప్పారు. ఈ విధంగా దేశ అభివృద్ధిలో వ్యవసాయం రంగం కీలక పాత్ర పోషించబోతుందని అనేక వ్యాఖ్యానాలు, ప్రవచనాలతో బడ్జెట్ ప్రసంగాన్ని వివరించారు. వ్యవసాయ రంగానికి ఏదో మేలు చేయబోతున్నట్టుగా సమాజాన్ని నమ్మించడానికి కేంద్ర మంత్రివర్యులు చాలా కష్టపడ్డారు. బడ్జెట్ ను స్థూలంగా పరిశీలిస్తే “మేడిపండు చూడ మేలిమై యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు” అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని ఏపి రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు. బుధవారం నగరంలోని లెనిన్ సెంటర్ లో బడ్జెట్ కాపీలను దగ్థం చేశారు. అనంతరం జరిగిన సభలో ఏపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ బడ్జెట్ మరింత డీ-రెగ్యులేషన్, లిబరలైజేషన్‌ను ప్రోత్సహిస్తూ, బీమా రంగాన్ని 100% ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ వ్యవసాయం, తయారీ, సేవల రంగాలపై కార్పొరేట్ ప్రభావాన్ని పెంచే విధంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందన్నారు.
మద్దతు ధరల కోసం చట్టపరమైన హామీ లేకపోవడం అన్యాయమన్నారు. ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల న్యాయమైన డిమాండైన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న C2 + 50% కలిపి మద్దతు ధరలు ప్రకటించడం దానికి చట్టపరమైన హామీ ఈ బడ్జెట్‌లో లేదని మండిపడ్డారు. రైతులను దగా చేసిన బడ్జెట్ ని నిట్టూర్చారు. ఈ కార్యక్రమంలో ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఏఐకెఎఫ్ నాయకులు కాసాని గణేష్ బాబు, వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చివరిగా బడ్జెట్ కాపీలను దగ్థం చేశారు. (Story: రైతులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్)