గోకనకొండ గ్రానైట్ క్వారీ మూసివేతపై చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మండలం గోకనకొండ గ్రామ సమీపంలో ఉన్న స్వస్తిక్ ఎక్స్‌పోర్ట్స్ గ్రానైట్ క్వారీ కారణంగా స్థానిక ప్రజలకు, మూగజీవాలకు తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో జయపురం గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీవాసులు ఈ నెల 22న ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ విప్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ ఏడి నాగిని శనివారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ కారణంగా కాలనీలపై రాళ్లు పడి గృహాల గోడలు పగిలిపోతున్నాయి. 200 అడుగులకు పైగా లోతు తీసిన కారణంగా నీరు నిలిచి, ఆ గుంతల్లో మూగజీవాలు పడిపోతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే క్వారీ ఉండడం వల్ల ప్రజలు భయాందోళన మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. చిన్నపిల్లలు క్వారీ ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాలనీకి 50 మీటర్ల దూరంలోనే క్వారీ ఉండటంతో బ్లాస్టింగ్ ధ్వనులు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశంపై ఏడి నాగిని కాలనీ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి, ప్రజలకు కలిగిన నష్టాన్ని, ప్రమాదాలను పై అధికారులకు నివేదించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు తమ ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గ్రానైట్ క్వారీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. (Story : గోకనకొండ గ్రానైట్ క్వారీ మూసివేతపై చర్యలు తీసుకోవాలి)