175 ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెంటనే స్పందించాలి : ప్రజా సంఘాలు
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం పంచాయితీ పరిధిలో 175 ఎకరాల ప్రభుత్వ భూములు గతంలో కొంతమంది భూస్వాములు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించుకోవడం జరిగిందని పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక సురేష్ మహల్ రోడ్ లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆ భూములు, చెరువు భూములు, కుంట పోరంబోకు, వాగు పోరంబోకు, అడవి పోరంబోకు, స్మశానము తదితర భూములు కూడా కలవు. ఆ భూములను విజయవాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మూల్పురి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తనకాపెట్టడం జరిగింది. ఆ భూములపై గతంలో గ్రామస్తులు హైకోర్టు మరియు లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. తదనంతరం హైకోర్టు ఆ భూములను స్వాధీనం చేసుకోమని రెవెన్యూ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జీవి ఆంజనేయులు ప్రస్తుత వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ తాము అధికారం లోకి వస్తే పేదలకు పంచుతామని ప్రకటించారు. అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఈ భూములపై స్పందించలేదు. వెంటనే ఎమ్మెల్యే కలుగజేసుకొని ఈ భూములు పేదలకు పంచాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, బీసీ నాయకులు వెంకట్రావు, పిడియం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, తదితరులు పాల్గొన్నారు.(Story : 175 ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి)