పరిశ్రమలు, భూయజమానుల్ని బెదిరిస్తే కఠిన చర్యలు
వినుకొండ స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లతో చీఫ్ విప్ జీవీ సమావేశం
స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న జీవీ
న్యూస్ తెలుగు /- వినుకొండ : పరిశ్రమలు, భూయజమానుల్ని బెదిరించే రోజులు కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లిపోయాయి అని చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కియా పరిశ్రమ లాంటి వాటికి వెళ్లి తమకు లంచాలు ఇవ్వమని అడిగితే వైసీపీ పాలనలో నడుస్తుందేమో గానీ తెదేపా పాలనలో నడవదని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. భవిష్యత్‌లో వినుకొండ మహా నగరంగా అభివృద్ధి చెందుతుందని.. ఇక్కడ స్థిరాస్తి రంగానికి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే రియల్టర్లు మాత్రం డీటీసీపీ, మున్సిపల్ అనుమతి పొందిన లేఅవుట్ల ప్లాట్లనే విక్రయించాలని స్పష్టం చేశారు. స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం వినుకొండలోని తన కార్యాలయంలో పట్టణానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణ రంగ ప్రతినిధులతో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచర్లకు అవసరమైన లింక్‌రోడ్లు ఏమైనా ఇబ్బంది ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. లేఅవుట్ల అనుమతులకు అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే తాటతీస్తామని హెచ్చరించారు. వివాదాలు లేని భూములు మాత్రమే కొని లేఅవుట్లు వేయాలని స్థిరాస్తి వ్యాపారులకు, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని బిల్డర్లకు సూచించారు. 10-20 ఏళ్ల నుంచి వినుకొండ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ స్థిరాస్తి రంగం పెరిగేదే కానీ తగ్గేది కాదన్నారు. రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి సిఫార్సు చేయమని చెబుతానన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర రహదారి కావాలని కోరారని, రోడ్డు వేయడానికి అక్కడ ప్రభుత్వ భూమి ఉందా, కళాశాలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయొచ్చో పరిశీలిస్తామన్నారు. ల్యాండ్ కన్వర్షన్ త్వరితగతిన చేసేవిధంగా తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆర్డీవోతో కూడా మాట్లాడినట్లు చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులు లంచాలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని, ఎవరైనా తన పేరు చెప్పి లంచాలు అడిగినా, పర్సంటేజీలు అడిగినా, వాటాలు అడిగినా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే వారిపై కేసులు పెట్టి లోపల వేయిస్తానని తెలిపారు. వినుకొండలో దందాలకు కాలం చెల్లుబాటు అయిపోయిందన్నారు. వివాదాల్లో ఉన్న భూములను కొనుగోలు చేసి అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోవద్దని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జీవి తో పాటు కూటమి నేతలు యార్లగడ్డ లెనిన్ కుమార్, కే నాగ శ్రీను, షమీం, పి.అయూబ్ ఖాన్, మానుకొండ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. (Story : పరిశ్రమలు, భూయజమానుల్ని బెదిరిస్తే కఠిన చర్యలు)