అడవులను కాపాడుకుంటేనే వినుకొండకు శ్రీరామరక్ష
వినుకొండ అటవీ రేంజ్ అధికారులు, సిబ్బందితో చీఫ్ విప్ జీవీ సమీక్ష
న్యూస్ తెలుగు / వినుకొండ : అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, పచ్చదనాన్ని పరిరక్షిస్తే వినుకొండకు శ్రీరామరక్ష, వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకు సంబంధించి ఎన్ని మొక్కలు నాటాలి, వాటి సంరక్షణ ఎలా అనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీడు భూములు, రెవెన్యూ, కొండ పోరంబోకుల్లో కూడా అందుకోసం కృత్రిమ అడవులు పెంచే విషయం పరిశీలించాలని సూచించారు. వినుకొండ అటవీ రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రేంజ్ పరిధిలోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అడవుల అభివృద్ధి, ఆ శాఖ తరఫున చేపట్టిన పనులను జీవీకి వివరించారు. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ. అటవీ వనరులు, జీవ వైవిధ్యం విధ్వంసం కాకుండా సంరక్షించాలన్నారు. మరీ ముఖ్యంగా రావి, మర్రి, వేప, గానుగ వంటి అధిక ఆక్సిజన్ అందించే చెట్లు పెంచాలన్నారు. వెదురు మొక్కలు నాటడం ద్వారా ఏటా ఆదాయం కూడా వస్తుందన్నారు. నగరవనాల ఏర్పాటుపై చర్చించి.. ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవాలన్నారు. పచ్చదనం పెంచడంలో బాగాపనిచేస్తే ప్రోత్సాహకాలు ఇద్దామన్నారు . కొప్పుకొండ తండాకి రహదారి నిర్మాణం కోసం అనుమతి ఇప్పించాలని, టెంపుల్ ఎకో పార్క్ కింద మన్నెపల్లి స్వామి గుడిని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. మూర్తిజాపురంలో రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్త సర్వే చేయాలని సూచించారు. అటవీప్రాంతం పరిధిని 4వేల హెక్టార్ల నుంచి 1500 హెక్టార్లకు తగ్గించి పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జంతువులు, పక్షుల కోసం నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అందుకోసం కుంటలు, చెరువుల మరమ్మతులు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఎర్రగుంట తండా, నల్లగుంట తండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఈ సమవేశంలోనే 2013 నుంచి అటవీశాఖలో నియామకాల్లేవని, 60 మంది అసిస్టెంట్ బీట్ అధికారుల పోస్టులు ఉంటే ముగ్గురే ఉన్నారని, బీట్ అధికారులు 30 ఏళ్ల సర్వీస్ చేసినా ప్రమోషన్లు లేవని, ఇళ్ల స్థలాలు కావాలని జీవీకి అటవీశాఖ అధికారులు వివరించారు. వాటిపై ప్రభుత్వంతో మాట్లాడతామని జీవీ అధికారులకు హామీ ఇచ్చారు. అందరు సమష్టిగా పనిచేసి అటవీ సంరక్షణ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలన్నారు. (Story : అడవులను కాపాడుకుంటేనే వినుకొండకు శ్రీరామరక్ష)