సమష్టిగా పనిచేసినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించగలం
వినుకొండ ఎంపీడీవో కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ ప్రజా దర్బార్
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కలిసి పనిచేసినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించగలుగుతామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకోసం ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలు సరైన వేదికలుగా నిలుస్తాయని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఇస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో లోకేష్, వారిద్దరి స్ఫూర్తితో తాను వినుకొండలో ప్రజాదర్బార్‌ను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. వినుకొండ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజా దర్బార్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలు వింటూ వినతులు స్వీకరించి భరోసా కల్పించారు. ప్రజా దర్బార్‌కు వివిధ సమస్యలపై 122 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన జీవీ అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, అర్జీలు తిరిగి రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇదే సందర్భంగా ఓటర్ల జాబితా నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచి ఉత్తమ అసిస్టెంట్ ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారి పురస్కారం అందుకున్న వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎప్పుడు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పిన మరిచిపోకుండా, పక్కన పెట్టకుండా పూర్తి చేస్తారన్నారు. అలా బాధ్యతగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తున్నట్లే బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులున్నది ప్రజాసమస్యలు పరిష్కరిం చడానికే అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు, నాయకుల్ని పదిసార్లు తిప్పించుకోవద్దని, అర్హత ఉన్నవారికి పింఛన్లు, ఇళ్లు, ప్రజలకోసం అధికారులు నిలబడి పనిచేయాలని సూచించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల వారిని చిన్నచూపు చూస్తే మాత్రం మూల్యం చెల్లించుకుంటా రన్నారు. కూటమి నాయకులు సమస్యలు తీసుకుని వస్తే స్పందించాలి, పనులు చేయాలన్నారు. లంచాల కోసం ఎవర్ని ఇబ్బంది పెట్టవద్దని, తనవద్దకు అలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజాదర్భార్‌లో వచ్చే ప్రతిదరఖాస్తుని అధికారులు పరిష్కరించారా లేదా అన్నది పరిశీలన చేస్తామని గుర్తుంచుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వైద్యారోగ్య సిబ్బంది, సచివాలయాల సిబ్బంది సహా అన్ని శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అంకితభావంతో పనిచేయాలన్నారు. అందరు కలసి పని చేస్తేనే సీఎం చంద్రబాబు ఆశిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చేరువ చేయగలుతామని తెలిపారు.(Story : సమష్టిగా పనిచేసినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించగలం )