సంక్షేమ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : ఆదివారం వనపర్తి మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభితో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను గ్రామ సభలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందు గ్రామ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. అనంతరం పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ నీ 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. తర్వాత మరో రెండు గ్యారంటీ లు 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరో గ్యారంటీ అయిన రెండు లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని నిరుపేద కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంవత్సరానికి 10 వేల నుండి 12 వేల రూపాయలకు పెంచిన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించిన్నట్లు తెలిపారు. ఈ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే అందే విధంగా గ్రామ సభలు పెట్టీ ప్రజల ఆమోదంతో అర్హులకే లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని, జాబితాలో పేర్లు లేవని దిగాలు పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. పేర్లు లేని వారు గ్రామ సభలో కానీ, ప్రజాపాలన సేవా కేంద్రంలో కానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసరా పెన్షన్ 2000 నుండి 4000 లకు పెంచడం, పేద మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం వంటి హామీలు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన వెంటనే వాటిని సైతం అమలు చేయడం జరుగుతుందన్నారు.
గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామని హామి ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పథకాలకు అర్హుల జాబితా సిద్ధం చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఈరోజు నాలుగు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హత ఉండి ఇంకా పేర్లు రాని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం, గోపాల్పేట మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో కూడా నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, గోపాల్పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : సంక్షేమ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే )