కూటమి తోనే రాష్ట్రంలో ప్రజాసామ్య, రాజ్యాంగ పాలన
*వినుకొండ తెదేపా కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు
*జాతీయ పతాకం ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పాలన నడుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువలను పెంచుతున్నారని, రాజ్యాంగ విలువలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం ఏ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం గురించి చెప్పిందో అవే మనసావాచా కర్మణా కూటమి ప్రభుత్వం పాటిస్తుందన్నారు. వినుకొండ తెదేపా కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ, రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు చాక్లెట్లు, మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. ఈ గణతంత్ర దినోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది, అమల్లోకి వచ్చి 75 ఏళ్లు నిండి 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నారు. ఈ 75 ఏళ్లలో సామాజిక న్యాయం పెంపొందించడంలో రాజ్యాంగం అసమాన్య పాత్ర పోషించిందని, అందుకే ప్రపంచ మేధావులు భారత రాజ్యాంగాన్ని సామాజిక విప్లవ సాధనంగా అభివర్ణించారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాసిందని, ప్రజాస్వామ్యానికి అగౌరవం జరిగిందని, వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అన్నీ చక్కదిద్దుతున్నామని, పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకోవాలని, అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ఇదే సమయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశం కోసం పోరాడిన లక్షల మందిని పోరాటస్ఫూర్తిని, కృషిని కూడా మననం చేసుకోవాల్సిన సమయం ఇదన్నారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు లాంటి ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఆ స్వాతంత్ర్య ఫలాలను మనం అనుభవిస్తున్నామని చెప్పారు. మనందరం హక్కులతో విధులు, పౌర బాధ్యతలు తప్పక గుర్తుంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story : కూటమి తోనే రాష్ట్రంలో ప్రజాసామ్య, రాజ్యాంగ పాలన)