ఈ నెల 26న వినుకొండలో ఉచిత కంటివైద్య శిబిరం
శివశక్తి ఫౌండేషన్ ప్రతినిధులు
న్యూస్ తెలుగు / వినుకొండ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న వినుకొండలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో నడుస్తున్న శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అనేక సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలో దాదాపు 42 వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించామని.. దానికి కొనసాగింపుగా ఇప్పుడీ శిబిరం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధులు జీవీ రమణారావు, కోటేశ్వరరావు, రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ జీవీ రమణారావు మాట్లాడుతూ. 23 ఏళ్లుగా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా చీఫ్‌విప్ జీవీ, సంస్థ ఛైర్మన్ లీలావతి ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు శంకర కంటి ఆస్పత్పి సహకారంతో కంటి వైద్య శిబిరం ఉండనుందని తెలిపారు. అయితే ఐ క్యాంపులో కళ్లద్దాలు ఇవ్వరని.. ఆపరేషన్లు అవసరం అనుకున్న వారికి వైద్యులు పరీక్ష చేసి గుంటూరు పంపిస్తారని, అక్కడ ఆపరేషన్లు చేస్తారని వెల్లడించారు. క్యాంపుకు వచ్చే ప్రతిఒక్కరు ఆరోగ్య శ్రీ, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని తెలిపారు. వాటిపై తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఉండాలని సూచించారు. (Story : ఈ నెల 26న వినుకొండలో ఉచిత కంటివైద్య శిబిరం)