భారీ నిధులతో వినుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు
అభివృద్ధి పనులపై అధికారులతో చీఫ్ విప్ జీవీ సమీక్షా సమావేశం
న్యూస్ తెలుగు/ వినుకొండ : భారీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో వినుకొండ పట్టణం రూపురేఖలు మారబోతున్నాయని, సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన రూ.కోటి 54 లక్షలు, రూ. 150 కోట్ల తాగునీటి పథకం పునరుద్ధరణతో పట్టణాన్ని ప్రగతిబాట పట్టించాలని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. ఆలస్యం, అలసత్వానికి ఏ మాత్రం తావులేకుండా అభివృద్ధి పనులు శరవేగంగా జరిపి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ విభాగానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, డీఈ విష్ణుమూర్తి, శానిటరీ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. వినుకొండ మున్సిపల్ సాధారణ నిధులు నుంచి రూ. కోటీ 54 లక్షలతో 14 అభివృద్ధి పనులను మంజూరు చేసి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రతి కాలనీ చివరి వరకు విద్యుత్ స్తంభాలు వేసి బల్బులు అమర్చాలని ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల బస్ షల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణం నలువైపులా 4బస్ షెల్టర్లు ఏర్పాటుకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇటీవలే అందుకు సంబంధించిన స్థల పరిశీలన కూడా మొదలు పెట్టామన్నారు. అలానే రూ.150 కోట్లతో రక్షిత మంచినీటి పథకం 2019లో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు చేయిస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వెంటనే కొత్త డీపీఆర్‌లు తయారు చేయించి టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమం అందించే విషయంల మున్సిపాలిటీలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘించడం గాని అవినీతి అక్రమాలకు పాల్పడితే క్షమించనని హెచ్చరించారు. (Story : భారీ నిధులతో వినుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు)