కొత్త ఆసరా పింఛన్లు జనవరి 26 నుంచి ఇవ్వాలి: సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కొత్త ఆసరా పింఛన్లు, మహిళకు రూ. 2500 జనవరి 26 నుంచి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామని ప్రకటించింది అన్నారు. వితంతువులు వికలాంగులు వృద్ధులు ఆసరా పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగులు ఉన్నాయన్నారు. వారికి వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి జనవరి 26 నుంచి పంపిణీ చేయాలన్నారు. పింఛన్ వస్తున్న భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు నెలరోజుల లోగా ఆసరా పింఛను ఇచ్చేవారని, ఇప్పుడు నెలలు గడిచినా ఇవ్వటం లేదన్నారు. నెలలుగా పింఛన్ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనవరి 26 నుంచి వికలాంగులకు రూ. 6000, ఇతరులకు రూ. 4000 పింఛన్ ఇవ్వాలన్నారు. మహిళకు రూ. 2500 ఇస్తామన్న హామీని ఈనెల నుంచే అమలు చేయాలన్నారు. నియోజకవర్గానికి ప్రభుత్వం మొదటి విడతలో 3500 ఇండ్లు కేటాయించిందని, ఇవి ఏ మూలకు సరిపోవని 5000 లకు పెంచాలన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ప్రతి గ్రామానికి 30, 40 కుటుంబాల అర్హుల జాబితా పంపారని, అర్హత ఉన్న చాలా కుటుంబాల పేర్లు ఆ జాబితాలలో లేవన్నారు. పునః పరిశీలన చేయాలన్నారు. ఆరోగ్యారెంటుల్లో భాగమైన వీటిని వెంటనే అమలు చేయాలని కోరారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, నాయకులు లక్ష్మీనారాయణ ,రాంబాబు, చిన్న కుర్మయ్య, జి కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : కొత్త ఆసరా పింఛన్లు జనవరి 26 నుంచి ఇవ్వాలి: సిపిఐ)