సంస్కృతి, సాంప్రదాయాలు
పెంపొందించేలా ముగ్గులు..
– “పద్మావతి నగర్” ముగ్గుల పోటీలకు విశేష స్పందన
– విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్
న్యూస్ తెలుగు/వినుకొండ : సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముగ్గులు ఉన్నాయని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మహిళలను అభినందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పట్టణంలోని కారంపూడి రోడ్డు “పద్మావతి నగర్” లో 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గస్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న. విజేతలకు బహుమతి ప్రధానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా, మహిళా సాధికారతను, శక్తి యుక్తులను చాటేలా, చక్కటి సందేశాలతో పలువురు వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేసేలా ఉన్నాయని అన్నారు. ముగ్గులు వేయడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుందని, అవి పండుగకు కూడా వన్నె తెస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేటితరం యువతకు పండుగ అవశ్యకత, విశిష్టత తెలియజేస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వెంచర్లు వేయాలని, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, పచ్చదనం ఉండాలని తెలిపారు. వినుకొండ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. పట్టణానికి మంచి కాలనీలు అవసరమని, అందుకనుగుణంగా తమ ప్రోత్సాహం ఉంటుందని, నిబంధనలు పాటించి వెంచర్లు వేయాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముగ్గుల పోటీల్లో 300 మంది పైగా మహిళలు పాల్గొన్నారు. న్యాయ నిర్ణీతలుగా వాసవి క్లబ్ డైరెక్టర్ కాజ్జయం విజయలక్ష్మి, జవ్వాజి సువర్ణ లక్ష్మి, చీతిరాళ్ల పద్మజ వల్లి వ్యవహరించారు. ముగ్గుల పోటీల్లో చుక్కల ముగ్గులు విభాగంలో పూజిత, ప్రధమ బహుమతి ఏసి, ఉమాదేవి ద్వితీయ బహుమతి ఎల్ఈడి టీవీ, సరళ తృతీయ బహుమతి వాషింగ్ మిషన్, నాగజ్యోతి నాలుగో బహుమతి గ్రైండర్, హేమలత ఐదో బహుమతి స్టాండ్ ఫ్యాన్, గీతల ముగ్గుల విభాగంలో బాల లక్ష్మి , ప్రథమ బహుమతి ఏసీ, వై. తిరుపతమ్మ ద్వితీయ బహుమతి ఎల్ఈడి టీవీ, చైతన్య తృతీయ బహుమతి వాషింగ్ మిషన్, ప్రియాంక నాలుగో బహుమతి గ్రైండర్, శ్రీదేవి ఐదవ బహుమతి టేబుల్ ఫ్యాన్ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి చేతుల మీదగా విజేతలకు అందజేశారు. అలాగే పదిమంది మహిళలకు పట్టు చీరలు, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకి కన్సిలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, ఎన్.శ్రీనివాసరావు, బిజెపి నాయకులు లెనిన్ కుమార్, న్యాయవాదులు రామకోటేశ్వరరావు, సైదారావు, నాదెండ్ల శరత్, షమీమ్, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.(Story : సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించేలా ముగ్గులు.. )