డ్రైవర్లు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు నివారించుకోవాలి
ఎస్. ఐ. సమీర్ భాష
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమ విధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసినప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని పట్టణ ఎస్ఐ. ఎస్.కె. సమీర్ భాష అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో ఈనెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో గురువారం వినుకొండ ఆర్టిసి గ్యారేజీలో రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిసి డిపో మేనేజర్. జె. నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన టౌన్ ఎస్ఐ ఎస్.కె సమీర్ భాష కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ. డ్రైవర్లు డ్యూటీ లేని సమయాలలో పూర్తిగా విశ్రాంతి తీసుకుని. తిరిగి డ్యూటీ కి వచ్చే సమయాలలో. తమ విధులు గుర్తెరిగి డ్యూటీలకు హాజరు కావాలన్నారు. అలాగే ఏకాగ్రతతో బస్సు నడుపుతూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను ఆయా గమ్యాలకు చేర్చినప్పుడే సంస్థకు మంచి గుర్తింపు వచ్చి ప్రజలు ఆర్టీసీ పట్ల ఆకర్షితులవుతారని ఆయన అన్నారు. డిపో మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం మానుకోవాలని సూచించారు. అలాగే ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ. ఆర్టీసీకి మంచి పేరు తేవాలన్నారు. (Story : డ్రైవర్లు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు నివారించుకోవాలి)