గీతాంజలి స్కూల్స్ నందు సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్ వారు కారంపూడి రోడ్డు లోని గీతాంజలి గ్రౌండ్స్ నందు మన ఊరు సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. దాదాపు మూడు వేల మంది చిన్నారులతో ఈ సంబరాలను నిర్వహించగా గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలుగు పండుగలలో సంక్రాంతి ఎంతో ముఖ్యమైనదని మరి ముఖ్యంగా రైతులకు ఎంతో ఇష్టమైన పండుగని అట్టి పండగ యొక్క విశిష్టత ఈనాటి చిన్నారులకు ఎక్కువ మందికి తెలియదని, కావున ఈతరం చిన్నారులు ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అనే సదుద్దేశంతో ఈ సంబరాలు నిర్వహించుచున్నట్లు తెలిపారు. భోగి మంటలు యొక్క విశిష్టతను పిల్లలకు తెలిపారు. భోగి పండ్ల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బొమ్మల కొలువులు, గంగిరెద్దులు,హరి దాసులు,పగటి వేషగాళ్లు, కోడి పందాలు, బతుకమ్మ ఆటలు, తోలుబొమ్మలాటలు, ఎడ్ల బండ్లు, గాలి పటాలు, పిండి వంటలు, చెరకు గడలు వంటి వాటిని పిల్లలకు వివరించి ఆయా కార్యక్రమాలను ఏర్పాటు చేసి చిన్నారులకు కనివిందును కలగజేశారు. పూరి లోని పండుగ వాతావరణం అంతా ఆ గ్రౌండ్స్ నందు వెల్లివిరియగా నిజమైన సంక్రాంతి అంటే ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా రూపొందించిన కార్యక్రమాలు చూపరులను విశేషంగా అలరించాయి. అలాగే చిన్నారులు వేసిన సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ యొక్క అనుభూతిని పొంది వెళ్లారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి కృష్ణవేణి, కరస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : గీతాంజలి స్కూల్స్ నందు సంక్రాంతి సంబరాలు )