ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి
ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, గీత, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు పి కళావతమ్మ డిమాండ్ చేశారు. వనపర్తి ఆఫీస్ లో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రేషన్ కార్డుల పై సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని ముందుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. సన్న బియ్యం మళ్ళీ కార్డులు ఉన్న వారికే ప్రయోజనం ఉంటుందని, కార్డులు లేని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే కార్డులు కలిగిన వారి కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దవారయ్యారని వారి పేర్లను కార్డుల్లో చేర్చాలని ఏళ్లుగా అడుగుతున్న పట్టించుకోవటం లేదన్నారు. పాత కార్డులో వారి పేర్లు చేర్చాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మహిళకు రూ. 2500 ఇవ్వాలని, పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. మహిళా ప్రయాణికులను ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చిన్నచూపు చూస్తున్నారని, స్టేజీల్లో మహిళలు కనిపిస్తే బస్సులు ఆపడం లేదన్నారు. బస్సులో సీట్ల కొరకు అడిగితే ఉచిత ప్రయాణికులకు సీట్లు ఎందుకని ఎగతాళి చేస్తున్నారని ఇది కాదన్నారు. ఫిర్యాదు చేస్తే అటువంటి సిబ్బందిపై చర్య తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రస్తుతం చట్టం తెచ్చిన 33% రిజర్వేషన్లను కూడా షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు బాలికలపై హత్యాచారాలు, వేధింపులు పెరిగాయి అన్నారు. నేరాలు చేసిన వారిపై కేసు నమోదు చేసిన శిక్షలు పడటం లేదని, నేరస్తులకు చట్టాలంటే భయం ఉండటం లేదన్నారు. కేసుల్లో శిక్షలు పడే విధంగా సరైన సాక్షాధాలను పోలీసులు కోర్టులో సమర్పించాలన్నారు. మహిళలు సంఘటితంగా గ్రామ కమిటీలను నిర్మించుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, జిల్లా కార్యదర్శి గీత, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు భూమిక, శిరీష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి)