Home ఒపీనియన్‌ ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం

ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం

0

ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్

‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం

– ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

న్యూస్ తెలుగు / హైదరాబాద్ సినిమా :  సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన పుట్టినరోజుని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. సమాజానికి సేవ చేయడంలో మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ లయన్ డాక్టర్ వై. కిరణ్ ముందుంటారు. ఈ క్రమంలోనే ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. రెండు దశాబ్దాలగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం ‘సంకల్ప్ దివాస్’లో ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ను ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరించారు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ వై. కిరణ్ మాట్లాడుతూ, “ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారంటే ఈ కార్యక్రమానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నా స్నేహితుడు, మనం కుటుంబ సభ్యుడిలా భావించే వ్యక్తి, సినిమాల్లో విలన్ గా నటిస్తూ రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్న గొప్ప మనిషి సోనూసూద్ ని ఈరోజు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఈ రోజు 50 ప్రత్యేక పాఠశాలల నుండి నా ప్రియమైన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారే ఈ కార్యక్రమానికి స్టార్స్. నా హృదయానికి బాగా దగ్గరైన సూరారం, నర్మిట్ట గ్రామాల నుండి కూడా అనేకమంది ఈ వేడుకకు హాజరయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రతి ఏడాది ఆనవాయితీగా సంకల్ప్ దివాస్ ని నిర్వహిస్తున్నాము. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకమైనది. కష్ట సుఖాలను పంచుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తాము. నా పుట్టినరోజు వేడుకను అర్థవంతంగా, సమాజానికి ఉపయోగపడేలా, కొందరి జీవితాల్లోనైనా వెలుగులు నింపేలా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంకల్ప్ దివాస్ కి శ్రీకారం చుట్టాను. ఈ సంకల్ప్ దివాస్ లో ఇప్పుడు రెండు గ్రామాలు, 50 పాఠశాలలు భాగమయ్యాయి. నేను కేవలం 2000 రూపాయిలతో నా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడి ఆశీస్సులు, నా తల్లిదండ్రులు నేర్పిన కృషి, పట్టుదలతోనే ఈరోజు ఇంతటి వాడిని అయ్యాను. అందుకే సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సంకల్ప్ దివాస్ ను ప్రారంభించాను. ఇప్పుడిది నా జీవితంలో భాగమైంది. ఎప్పుడైనా మనసు బాలేకపోయినా, ఈ స్వచ్ఛమైన హృదయాలున్న పిల్లలతోనే సమయాన్ని గడిపి నూతనోత్సాహం పొందుతూ ఉంటాను. అన్ని ప్రభుత్వాలు మానవత్వంతో ఆలోచించి, ఇలాంటి పిల్లలకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి వారికి అండగా ఉండే దిశగా అడుగులు వేయాలి. ఇలాంటి  ఎందరో ప్రత్యేక పిల్లలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు వారి గురించి ఆలోచన చేయాలి. అలాగే సమాజం కూడా వారితో తగిన సమయం గడిపి, వారి అవసరాలను తెలుసుకొని తోచిన సాయం చేస్తే బాగుంటుంది. అలాగే గ్రామాల్లో ఉండేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. గ్రామాల్లోనూ ఆర్గానిక్ వ్యవసాయం తో పాటు,  వృత్తులను ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. కానీ సమయం మరియు ఆర్థిక వనరులను బట్టి సాధ్యమైన వరకు చేస్తున్నాము. అలాగే డ్రగ్స్ వల్ల ఎందరో యువత ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 50 పాఠశాలలోని పిల్లల బాగోగులు చూసుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  సమాజ సేవకు ఎప్పుడూ ముందుండే స్నేహితుడు సోనూసూద్ ని సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీడియాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

సోనూసూద్ మాట్లాడుతూ, “ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందటం గౌరవంగా భావిస్తున్నాను. సోదరుడు కిరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసే గొప్ప సేవా కార్యక్రమాల గురించి తరచూ వింటుంటాను. అలాంటి వ్యక్తితో వేదికను పంచుకోవడం గర్వంగా ఉంది. నేను కిరణ్ గారిని కలవకముందే, ఆయన గొప్పతనం గురించి ఎంతో విన్నాను. ఈ ప్రత్యేక పిల్లలు రియల్ హీరోలు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన కిరణ్ గారికి కృతజ్ఞతలు. కిరణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి. ఆయన తలపెట్టిన సంకల్ప్ దివాస్ కి నా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. హైదరాబాద్ తో నాకు ప్రత్యేక అనుబంధముంది. నేను పంజాబీ అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. అందుకే నేను తెలుగువారిని కుటుంబసభ్యులలాగా భావిస్తాను. లాక్ డౌన్ సమయంలో మనం ఎంత సంపాదించం అనే దానికంటే, మనం సమాజానికి ఏం చేశాం అనేదే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని గ్రహించాను. అప్పటినుంచి కిరణ్ గారిలా తోచిన సాయం చేస్తున్నాను. ఈ తరంతో పాటు, భవిష్యత్ తరాలు కూడా సమాజ సేవ వైపు అడుగులు వేసేలా కిరణ్ గారు స్ఫూర్తి నింపుతున్నారు. కిరణ్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

ముఖ్య అతిథి హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ మాట్లాడుతూ, “ఇంతటి గొప్ప కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. కిరణ్ గారి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. కిరణ్ గారు సమాజం గురించి ఆలోచించి, తన పుట్టినరోజును సంకల్ప్ దివాస్ అనే గొప్ప కార్యక్రమంగా జరుపుకోవడం అభినందనీయం. ఎందరో పిల్లలకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కిరణ్ గారు ఇలాగే మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ యాంకర్ స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన  ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమంలో పలువురు పిల్లలు గాన, నృత్య ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని చాటి చెప్పారు. అలాగే ఈ వేడుకలో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న పలువురిని ‘సంకల్ప్ సేవా పురస్కార్’తో సత్కరించడం విశేషం. (Story : ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version