మాదక ద్రవ్యాల అలవాటును “సంకల్పం”తో దూరం చేద్దాం
రాష్ట్ర హోంశాఖామాత్యులు వంగలపూడి అనిత
విజయనగరం : మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం” కార్యక్రమాన్ని నెలిమర్ల మహారాజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (MIMS వైద్య కళాశాల)లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు వంగలపూడి అనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ – విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులని, అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, జీవితాలు నాశనం కాకూడదన్న లక్ష్యంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా రాష్ట్రాన్ని మాదకద్రవ్యరహితం చేయాలన్న ఉద్దేశ్యంతో డిజి స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ‘ఈగల్’ పేరుతో పోలీసుశాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 1972 అన్న టోల్ ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేసామన్నారు. ఎవరైనా ఈ నంబరుకు మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చునన్నారు. ఇలా ఎవరైనా సమాచారం అందిస్తే, వారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈనాడు రాష్ట్రంలో ఏ నేరం జరిగిన వాటి వెనుక దురదృష్టవసాత్తు డ్రగ్స్ ప్రభావం కనిపిస్తుందన్నారు.డ్రగ్స్ ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గంజాయి, డ్రగ్స్ మితిమీరి వినియోగిస్తే, మత్తు ప్రభావంతో విచక్షణ కోల్పోయి, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కళాశాల యాజమాన్యాలు కూడా డ్రగ్స్ ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ తమ విద్యాసంస్థలను నడిపేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ ను ఎంజాయ్ చేసేందుకు వినియోగించడం ప్రారంభిస్తే.. డ్రగ్స్ మనల్ని ఎంజాయ్ చేస్తూ.. మనల్ని చెడు మార్గంలో నడిపిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు.డ్రగ్స్ ఒక్కసారి వాడితే ఏమీ కాదులే.. అన్న నిర్లక్ష్యం వద్దని, ‘బీ స్మార్ట్ – డోన్ట్ స్టార్ట్’ అన్న నినాదాన్ని నిజం చేయాలని, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చదువును ఎంజాయ్ చేస్తూ, చదవాలని, అలా చేయడం వలన ఒత్తిడికి దూరంగా ఉండొచ్చని, భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా ఎదగాలని, ప్రజలకు మంచి సేవలందించాలని వైద్య విద్యార్థులను కోరారు.రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – విద్యార్ధులు ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపడం కాకుండా నాలెడ్జ్ పెంపొందించేందుకు వినియోగంచుకోవాలన్నారు. ఏంటీ డ్రగ్స్ కమిటీలు కళాశాలలో డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ నేర ప్రవృత్తిని యువతలో పెంచుతుందని, భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించాలన్న సదుద్ధేశంతో ‘సంకల్పం’ కార్యక్రమం చేపట్టి, యువతను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు, వాటి దుష్పప్రభావాలను వివరిస్తున్నామని, జిల్లా పోలీసుశాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమం అభినందనీయమన్నారు.
పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల నియంత్రణకు తమవంతు సహకారంను పోలీసుశాఖకు అందిస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మాదక ద్రవ్యాలను నియంత్రణకు కృషి చేయాలని, సమాచారాన్ని పోలీసుశాఖకు అందించాలని కోరారు.
నెల్లిమర్ల ఎమ్మేల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ – సంకల్పం కార్యక్రమాన్ని ముందుగా తమ మిరాకిల్ కళాశాలలోనే ప్రారంభించామన్నారు. విద్యార్థులను చైతన్యపర్చేందుకు జిల్లా ఎస్పీ ప్రిపేర్ చేసిన ప్రజెంటేషను అద్భుతంగా ఉందని, కార్యక్రమం ముగిసిన తరువాత తమ విద్యార్థులు ఎంతో స్ఫూర్తిని పొందారన్నారు. నేరాలను, డ్రగ్స్ నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు.టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ – డ్రగ్స్ కట్టడికి మనందరం అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో పని చేయాలన్నారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల ప్రభావం ఏవిధంగా ఉంటుంది, కెరియర్, మానవ జీవితాలను ఏవిధంగా నాశనం చేస్తాయన్న విషయాలు వైద్య వృత్తి చేపట్టనున్న విద్యార్థులకు తెలుసునన్నారు. డ్రగ్స్ నియంత్రణ అన్నది సమాజానికి పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నారు. ఇప్పటికే జిల్లా పోలీసుశాఖ సంకల్పం కార్యక్రమంను 350 పైగా కళాశాలల్లో నిర్వహించి, 35 వేల మంది విద్యార్థులను, మరో 900 పైబడి అవగాహన సదస్సులు చేపట్టి, 80వేల మందిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చైతన్యపర్చామని జిల్లా ఎస్పీ అన్నారు. హత్య నేరం కంటే డ్రగ్స్ తీవ్రమైన నేరమని, హత్య నేరంకు యావజ్జీవ కారాగార శిక్ష 14సం.లు జైలు శిక్ష విధిస్తే, గంజాయి కేసుల్లో నిందితులుగా పట్టుబడితే 20 సం.లు వరకు జైలుశిక్ష విధించవచ్చునని జిల్లా ఎస్పీ అన్నారు.అనంతరం, రాష్ట్ర హెూంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మిమ్స్ కళాశాల యాజమాన్యానికి డ్రగ్స్ పట్ల అవగాహన కలిగిన కళాశాల ధృవపరుస్తూ సర్టిఫికేటును కళాశాల డీన్ డా. సిహెచ్. లక్ష్మీ కుమార్, చైర్మన్ అల్లూరి సత్యన్నారాయణ రాజుకు అందజేసారు. అంతకుముందు, జ్యోతి ప్రజ్వలనంతో సభను ప్రారంభించారు. మిమ్స్ కళాశాలలో డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రొఫెసర్స్, విద్యార్థులు, నెల్లిమర్ల ఎస్ఐతో ప్రత్యేకంగా ఏంటి డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెలమల శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు విద్యార్థులతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్ నియంత్రణకు సమాచారాన్ని అందించేందుకు కళాశాల ప్రాంగణంలో డ్రాప్ బాక్స్ ను, ప్రత్యేకంగా రూపొందించిన సంకల్పం ప్రచార రథాన్ని రాష్ట్ర హోం శాఖామాత్యులు వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఒఎస్డి అనిల్ పులిపాటి, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, మిమ్స్ ఛైర్మన్ ఎ.సత్యన్నారాయణ రాజు, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ వర్మ,డీన్ సిహెచ్. లక్ష్మీ కుమార్, మిమ్స్ కళాశాల ప్రొఫెసర్స్, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.(Story : మాదక ద్రవ్యాల అలవాటును “సంకల్పం”తో దూరం చేద్దాం)