ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను
విజయవంతం చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. ప్రజా పాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏడాది పూర్తి అగుచున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లుతో కలిసి ఐ.డి.ఓ.సి ప్రాంగణం నుంచి ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాల అధికారి, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర చేపట్టడం జరిగిందన్నారు.
ప్రజా పాలన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పై ప్రజలకు ఆట పాట ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులు నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు రోజుకు 3 ప్రోగ్రాంల చొప్పున 57 ప్రోగ్రాములు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కళా యాత్ర ఒక నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తుందన్నారు. అదేవిధంగా డిసెంబర్ 6వ తేదీన రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి అంతాదుల నాగరాజు కళా బృందం వనపర్తి జిల్లాలో భారీ కళా ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో, మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించే సాంస్కృతిక కళాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, డి.పి. ఒ సురేష్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, ఏఓ భాను ప్రకాష్, సంస్కృతిక శాఖ కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలి)