లంచాల కేసు దృష్టి మళ్లించడానికే జగన్ ఛార్టీల నాటకాలు
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : సౌర విద్యుత్ ఒప్పందాల లంచాల కేసులో అమెరికాలో అడ్డంగా ఇరుక్కున్నది కాక వైకాపా అధ్యక్షుడు జగన్ పోరుబాట పేరిట దృష్టి మళ్లించేందుకు తిప్పలు పడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, దిగిపోతూ కూడా భారం వేసి, ఆ భారంపై ఇప్పుడు దొంగ దీక్షలకు దిగడమే అందుకు నిదర్శమని ఆయన దుయ్యబట్టారు. క్విడ్ ప్రో కోను విద్యుత్ రంగానికి కూడా విస్తరించి అడ్డగోలుగా దోచుకున్న జగన్ రాష్ట్రానికే తీరని అన్యాయం చేశారని వాపోయారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై పోరుబాట అన్న వైకాపా నిర్ణ యంపై గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జగన్ తీరును తూర్పార బట్టారు జీవీ. ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఒక్కొక్క కుటుంబంపై సగటున రూ. 4వేల కోట్లు భారం వేసింది, అయిదేళ్లలో మొత్తం రూ.20వేల కోట్లు భారం వేసింది మరిచిపోయారా అని నిలదీశారు.ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు మంగళం పాడింది, విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాల్ని 1.14 లక్షల కోట్లకు చేర్చి అప్పుల్లో ముంచి దివాళ తీయించింది… ఎవరని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రైతులకు వద్దన్నా మీటర్లు పెట్టి విద్యుత్ రంగాన్ని చిమ్మచీకట్లలోకి నెట్టిన వ్యక్తి మళ్లీ అదే ముసుగులో ఆందోళనలకు పిలుపునివ్వడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు జీవీ. సరిగ్గా దిగిపోవడానికి రెండు నెలల ముందు కూడా పన్నెండున్నర వేల కోట్ల రూపాయల భారానికి సంబంధి ంచి నిర్ణయం తీసుకుని, ఆ నెపం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపైకి నెట్టేసిన చావు తెలివితేటలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇదే విద్యుత్ రంగంలో అయినవారికి దోచిపెట్టడంలో, ఆ దోపిడీలో లంచాల పేరిట అవినీతిచేసి అంతర్జాతీయస్థాయిలో పరువు తీసిన వ్యక్తి జగన్, అలాంటి వ్యక్తిని ప్రజలు ఇంకా నమ్ముతారని అనుకుంటున్నారని చురకలు వేశారు. జగన్ తీరు చూస్తుంటే ప్రజలపై ప్రేమ, విద్యుత్ ఛార్జీల విషయంలో బాధ కంటే ఈ పేరిట పార్టీలో మిగిలింది ఎవరో, మిగిలినవారిలోనూ తన మాట వినేది ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుతే కనిపిస్తోందన్నారు. మొన్నటికి మొన్న రైతు సమస్యల పేరిట పోరుబాట ఇలానే అట్టర్ ఫ్లాప్ అయిందని, అయినా ఇంకా దింపుడు కళ్లెం ఆశలతో విద్యుత్ పేరిట దీక్షలని సొంత పార్టీనేతలకే జగన్ పరీక్ష పెడుతున్నారన్నారు. రాయలసీమలో, సొంత జిల్లా కడపలో పట్టుమని పదిమందిని ఆందోళనలకు పోగు చేయలేని వ్యక్తి ఇంకా వైకాపా పార్టీని నడపడం, కాపాడుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోందన్నారు ప్రభుత్వచీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. (Story : లంచాల కేసు దృష్టి మళ్లించడానికే జగన్ ఛార్టీల నాటకాలు)