టిడ్కో ఇళ్లపై ప్రజలను మోసం చేసిన జగన్ సర్కారు
జగన్‌కేమో వందల కోట్ల ప్యాలెస్‌లు, పేదలకు సెంటు స్థలాల్లో ఇళ్లా
టిడ్కో ఇళ్లలో గుత్తేదారులు, లబ్ధిదారులు నష్టపోయిన తీరుపై
అసెంబ్లీలో లఘు చర్చలో జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో ప్రతిపేదవాడికి సొంతిళ్లు ఇవ్వాలన్న తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంకల్పాన్ని నాశనం చేయడమే కాదు, ప్రజల్ని అతిదారుణంగా మోసం చేసిన దుర్మార్గపు పాలన జగన్‌దని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు. జగన్‌కేమో రూ. వందల కోట్ల ప్యాలెస్‌లు, పేదలకేమో సెంటు స్థలాల్లో ఇళ్లా అని ధ్వజమెత్తారు. పేదల గృహనిర్మాణంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి టిడ్కో ఇళ్లే నిదర్శమని ఆయన వాపోయారు. వివరాల్లోకి వెళితే 2014-19 మధ్య 7లక్షల టిడ్కో ఇళ్లను మంజూరు అయ్యాయని అందులో మొదటిదశగా 4లక్షల 50 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగిందన్న ఆయన వాటిల్లో 2019 నాటి 3లక్షల 13వేల 832 ఇళ్లు 90శాతం పూర్తి చేశామన్నారు. అలాంటి తరుణంలో ఒక్కఅవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నాశనం చేశారన్నారు. శనివారం అసెంబ్లీలో ఈ మేరకు టిడ్కో ఇళ్లపై స్వల్ప కాలిక చర్చలో జగన్, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై తూర్పారాబట్టారు జీవీ. ఒక్క రూపాయికే ఇళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఏడాదికి 5లక్షల ఇళ్లు చొప్పున 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 90% పూర్తయిన ఇళ్లను కూడా కనీసం పట్టించుకోలేదన్నారు. చివరకు 50శాతం, లక్షా 67వేలు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇళ్లు పూర్తి కాలేదు సరికదా… నెలనెలా డబ్బులు కట్టమని బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చి నష్టపోయారన్నారు. టిడ్కో ఇళ్ల కోసం రూ.17 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి వచ్చిందన్నారు, పేదలు కట్టిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదన్నారు. వినుకొండలో 4వేల 96 టిడ్కో ఇళ్లొస్తే నాడు 1200 ఇళ్లు చకచకా 80% పూర్తి చేశామని వైకాపా అయిదేళ్లలో కనీసం వాటిని పూర్తి చేయలేదన్నారు. సెంటు స్థలాల పేరుతోనూ జగన్ మోసం చేశారన్నారు జీవీ. జగనన్న కాలనీలను ఊదరగొట్టి అవీ పూర్తి చేయలేదన్నారు. ఈ పరిస్థితు ల్లోనే రానున్న ఏడాది, రెండేళ్లలో ప్రణాళికాప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పేదలకివ్వాలని మంత్రి నారాయణను కోరారు. (Story : టిడ్కో ఇళ్లపై ప్రజలను మోసం చేసిన జగన్ సర్కారు)