అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంగా ఉన్న బడ్జెట్
న్యూస్‌తెలుగు/విజయనగరం : అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిందని జనసేన నేత గురాన అయ్యలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టే విధంగా బడ్జెట్ వుందన్నారు. సంపద సృష్టించాలన్న సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టే విధంగా ఆర్థిక మంత్రి కేశవులు అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. గత పాలనలో మోసపోయిన అన్నీ వర్గాలకు, అన్నీ రంగాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం కేటాయింపులు చేసిందన్నారు. రూ.2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి – రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టిందన్నారు. జగన్ బడ్జెట్ సమావేశాలకు మొహం చాటేయడం బాధ్యత రాహిత్యమని… బాధ్యతలేని వారు ప్రతిపక్షం అనే మాట ఉచ్చరించే అర్హత లేదన్నారు. (Story : అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంగా ఉన్న బడ్జెట్)