యువత అవకాశాలకు కీలకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
తెదేపా నేతలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు చాలా కీలకం అన్నారు తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు. 20 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యాన్ని బల పరుస్తూ నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమి జెండా ఎగరేయాలన్నారు. ఆదివారం వినుకొండ శివయ్య స్తూపం కూడలిలోని ఓటరు నమోదు కేంద్రంలో తెదేపా నాయకులతో కలిసి ఆయన దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలంటే పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. వినుకొండ నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు చురుగ్గా సాగుతోందని ఈ నెల 6 వరకే గడువు ఉందన్నారు. పట్టభద్రులై ఉండి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఓటరు దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌ఖాన్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటరుగా నమోదు అదుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని, ఈ అవకాశం పట్టభద్రులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు ఎంపిక చేసిన ఆలపాటి రాజాను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం జనసేన నేత నిశ్సంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ తరఫున అర్హులైన పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయిస్తున్నట్లు తెలిపారు. (Story : యువత అవకాశాలకు కీలకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు)