అక్రిడేషన్ విధానాల కమిటీలో దళిత జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి
దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపకుడు అధ్యక్షులు కాశపోగు జాన్
న్యూస్‌తెలుగు/ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ల జీవో 1395 ను సవరించి దళిత జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. డేవిడ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, దళిత జర్నలిస్ట్ సంఘాలకు గుర్తింపునిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత జర్నలిస్ట్ సంఘాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి దళిత జర్నలిస్ట్ సంఘాలపై పునరాలోచన చేయాలని కోరారు. 2 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరిని, బీసీ, మైనార్టీ లను మాత్రమే అక్రిడేషన్ విధివిధానాల కమిటీలో ప్రాతినిధ్యం ఇచ్చారని వాపోయారు. 24 శాతం ఉన్న దళిత జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్ కమిటీలో ఒక్కరికి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్రంలోని దళిత జర్నలిస్ట్ సంఘాలు ఏకమై అక్రిడేషన్ విధివిధానాల కమిటీలో స్థానం సంపాదించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (Story : అక్రిడేషన్ విధానాల కమిటీలో దళిత జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి )