పేద ప్రజల కష్టజీవుల సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్‌తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగి నూరవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా శత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో శివయ్య డివిజన్ తండ్రి సన్నిధి చర్చి వద్ద శుక్రవారం నాడు షేక్ మస్తాన్ అధ్యక్షతన జరిగిన శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 26 నాటికి పార్టీ ఆవిర్భవించి నూరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని పార్టీ శాఖలలో అరుణ పతాకాలు ఆవిష్కరించి సభలు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సాంఘిక దురాచారాలను అరికట్టుచు అసమానతలు తొలగించుటకు సమాజంలో పేద బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కు కల్పించాలని రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలను అరికట్టి కార్మికులు కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు పోరాటాలు చేసిందన్నారు. సాయుధ పోరాటంలో గ్రామీణ రైతాంగాన్ని ఐక్యం చేసి రజాకార సైన్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిందని రైతాంగాన్ని ఐక్యం చేసి 10 లక్షల ఎకరాల భూములను పంచిన చరిత్ర సిపిఐ దన్నారు. కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నిరంకుశంగా పాలన సాగిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడిందని మన దేశం భిన్నత్వంలో ఏకత్వం గా బహుళ మతాలు కులాలు అన్నదమ్ముల వలె కలిసి శాంతియుతంగా జీవిస్తున్న మన మధ్య విభేదాలు కలిగించే ప్రయత్నాలు అడ్డుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వాన్ని స్థాపించుటకు సిపిఐ నిరంతరం శ్రమిస్తోందన్నారు. జిల్లాలోపార్టీ ఇచ్చిన పిలుపులలో పాల్గొనుచు నియోజకవర్గంలోని అనేక సమస్యలను పరిష్కరించుకొనుచు ఎర్రజెండా నీడలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందని వేలాదిమందికి భూములు పంపిణీ, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన చరిత్ర సిపిఐదన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఇచ్చిన పిలుపులో శ్రమజీవులు పాల్గొనుచు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొనుచు సిపిఐ నాయకత్వం ముందుకు సాగుతుందని ఆజాద్ నగర్ కాలనీ ఇళ్లపట్టాలు మంచినీళ్లు కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకొనవలసి ఉందని ఎర్రజెండా మన నియోజకవర్గంలో జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సింది గా వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు షేక్ మస్తాన్ శాఖ కార్యదర్శిగా రామయ్య, వరదరాజులు సహయ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, మల్లికార్జున, షేక్ మస్తాన్, మంగమ్మ, ప్రశాంతి, పేరమ్మ, లక్ష్మీ, రామయ్య, వరదరాజులు, భాస్కరు, ఆనంద్, నరసింహారావు తదితరులు శాఖ సభ్యులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story : పేద ప్రజల కష్టజీవుల సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే)