పేద ప్రజలకు కంటి వెలుగు ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం
అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, కోశాధికారి వై. సుదర్శన్ గుప్తా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, కోశాధికారి వై. సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోటరీ సత్యసాయి జోన్ అసిస్టెంట్ గవర్నర్ ప్రభాకర్ విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంతత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. శిబిరానికి వచ్చిన వారందరికీ వైద్య చికిత్సలతో పాటు, ఎంపికైన వారికి ఉచిత రవాణా, ఉచిత ఆపరేషన్, ఉచిత వసతి, ఉచిత అద్దాలు పంపిణీ చేయబడునని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు పివి. రమణారెడ్డి, కీర్తిశేషులు అనసూయమ్మ జ్ఞాపకార్థం కుమారులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుష్మాలు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఈ శిబిరంలో 84 మంది కంటి చికిత్సలకు రాగా అందులో 63 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలోని మెంటల్ ఛాలెంజెడ్ పిల్లలకు ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కోసం 6000 రూపాయలు విలువచేసే కిట్టును భారతికు అసిస్టెంట్ గవర్నర్ ద్వారా అందజేయడం జరిగింది అని తెలిపారు. కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా రోగులకు తెలపడం జరిగిందని క్యాంపు చైర్మన్గా శ్రీనివాసుల రెడ్డి వ్యవహరించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, సభ్యులు సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు, రమేష్ బాబు, కృష్ణమూర్తి, మనోహర్ గుప్తా, శివయ్య, రామకృష్ణ, కొండయ్య, బివి. వెంకటచలాం తదితరులు పాల్గొన్నారు. (Story : పేద ప్రజలకు కంటి వెలుగు ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం)