కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన పధకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం బ్యాంకర్లతో కేంద్ర ప్రభుత్వ బీమా పధకాల నమోదు, ఎస్టీ, ఎస్సి కార్పొరేషన్ రుణాల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర బీమా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన పధకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఇవి చాలా ముఖ్యమైన పథకాలని, బ్యాంకర్లు అందరూ సీరియస్ గా ద్రుష్టి సారించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పథకాలకు అర్హులేనని, వారందరికీ ఈ బీమా పధకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఖాతాదారు ఇంటికి వెళ్లి వారికి ఈ బీమా పథకాలను వివరించి, నమోదు చేసుకునేలా చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతిలో పంచాయతి కార్యదర్శితో సమన్వయం చేసుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకానికి కేవలం సంవత్సరానికి రూ.430 కడితే రూ.2 లక్షల జీవిత భీమా వస్తుందని, అదే ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకంలో సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే ప్రమాదం జరిగినప్పుడు పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష, శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే రూ.2 లక్షల భీమా వస్తుందని అవగాహన కల్పించాలన్నారు. అయితే, బ్యాంకర్లు స్పందిస్తూ ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించామని బదులిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల గురించి మాట్లాడుతూ 2018-19 లో స్వయం ఉపాధి కొరకు ఎస్సీ శాఖ ద్వారా మంజూరు అయిన 58 సబ్సిడీ రుణాలు గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని బ్యాంకర్లను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ప్రశ్నించారు. ఆయా రుణాలు వేగంగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారుని వారీగా రుణం గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు తెలుసుకుని బ్యాంకర్లతో కలిసి పరిష్కారం దిశగా పని చేయాలన్నారు. డ్యూయల్ అకౌంట్ తెరవని లబ్దిదారునికి వెంట ఉండి అకౌంట్ ఓపెన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల ఆర్థికాభ్యున్నతికి 80 శాతం రాయితీపై ప్రభుత్వం ఏటా ట్రైకార్ ట్రైబల్ కార్పొరేషన్) రుణాలు కేటాయిస్తుందని, అందులోభాగంగా జిల్లాలో ఇంకా పెండింగ్ లో ఉన్న రుణాలను గ్రౌండింగ్ చేయించే విధంగా దగ్గరుండి చర్యలు తీసుకోవాలని గిరిజన శాఖ అధికారిని ఆదేశించారు. పీఎంఈజీపీ రుణాలను యువత వినియోగించుకోవాలి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, స్థిర ఆదాయం వచ్చే నూతన యూనిట్లను స్థాపించి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధాన్య రంగాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. యువత ఎవరైనా సేవా, పరిశ్రమిక రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే పీఎంఈజీపీ పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పీఎంఈజీపీ కార్యక్రమం కింద అర్హులైన వారు వివిధ రకాల వ్యాపార యూనిట్లు పెట్టేవారికి గ్రామీణ 35శాతం వరకు సబ్సిడీ అందుతుందని చెప్పారు. ఎవరైనా యూనిట్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటే జిల్లా కలెక్టరేట్ లోని ఇండస్ట్రీస్ శాఖ అధికారి నగేష్ (8332904444) ను లేదా లీడ్ బ్యాంకు మేనేజర్ సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ ఉమాదేవి, గిరిజన శాఖ అధికారి నుషిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లిఖార్జున్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, ఇండస్ట్రీస్ ప్రమోషన్ ఆఫీసర్ నగేష్, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి)