పోటి పరీక్షల పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) ; పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్దుల కొరకు ప్రణాళికా శాఖ రూపొందించిన “తెలంగాణ సామజిక ఆర్దిక ముఖ చిత్రం-2024” పుస్తకాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ తన ఛాంబర్లో ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన సమగ్ర సమాచారం, ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా స్యూటికల్స్‌తో, సహా విభిన్న రంగాల ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని, రాష్ట్రం యొక్క వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, సహాయక విధానాలు గణనీయమైన పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, కీలక ఆర్థిక సూచికలను క్రోడీకరించి, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో మన రాష్ట్రం ఎలా పురోగమిస్తోందో తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పధం 2024 తెలియచేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తెలిపారు.
ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను తెలియ చేస్తూ ప్రణాళికా శాఖ ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధనలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దులు, ఉపాధ్యాయులు, పరిశోదకులకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.ఒక్కొక్క పుస్తకాన్ని రూ.150/-లకు ముఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయం, ములుగు నందు కార్యాలయ పని వేళలలో విక్రయించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల వారు కొనుగోలు చేయవలసినదిగా తెలిపారు. సమగ్ర సమాచారంతో పుస్తక రూపకల్పనలో భాగస్వాములైన అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి యం.ప్రకాష్, డి.పి ఆర్ ఓ, రఫిక్, డిప్యూటి ఎస్.ఓ. యూ.లక్ష్మి నారాయణ, డి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : పోటి పరీక్షల పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్)