Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు

ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు

0

ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు

కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరెల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఒక లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను తన లేఖతో జతపర్చానని, దానిని పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన చేనేత, పట్టు చీరెల తయారీ నిపుణులకు ధర్మవరం పుట్టినిల్లని ఆయన త‌న లేఖ‌లో పేర్కొన్నారు.
ధర్మవరం నియోజకవర్గానికి తాను శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించటం యాదృచ్ఛికమని ఆయన తెలిపారు. ఆధునిక యాంత్రిక యుగంలో పవర్లూమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ధర్మవరం సంప్రదాయ పట్టు చీరెల తయారీ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని , దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోతూ వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్ళ ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత, పట్టు చీరెల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు తాను పంపుతున్న డిపిఆర్ లో పలు ప్రతిపాదనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు 28,500 కుటుంబాలు, ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో 12,800 కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుని వారి జీవితాలను చక్కదిద్దేందుకు ఈ రంగంలో తగిన పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని మంత్రి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.
దాదాపు రు.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో 80 శాతం మేర నిధులు (సుమారు రు.24 కోట్లు) కేంద్రం భరిస్తే, మిగిలిన 20 శాతం నిధులు (రు.6 కోట్ల)ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లేఖ‌లో వివ‌రించారు.
ప్రతిపాదిత హ్యాండ్లూమ్ క్లస్టర్ తో అనేక ప్రయోజనాలున్నందున ఈ డిపిఆర్ ను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞ‌ప్తి చేశారు. (Story : ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version