Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగులను నులిమేద్దాం

పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగులను నులిమేద్దాం

0

పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగులను నులిమేద్దాం

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జీ.సృజన

న్యూస్‌ తెలుగు/విజయవాడ : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీన అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డా.జీ.సృజన అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్‌ సోమవారం డీఆర్‌వో వీ.శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని, ఎక్కువగా అలసిపోవటం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు వంటివాటితో పాటు బరువు తగ్గటం, తద్వారా వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. అల్బెండజోల్‌ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూడవచ్చని ఈ నెల 25వ తేదీన 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు, కిశోర బాలలకు అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ జరుగుతుందని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి, తమ పిల్లలు మాత్రలు తీసుకునేలా చూడాలన్నారు. 1`2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్ర(200 మి.గ్రా.), ఆపైన 19 ఏళ్ల వయసు వరకు ఒక మాత్ర (400 మి.గ్రా.) తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో గోడపత్రికల ద్వారా నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించి పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, నర్సింగ్‌ తదితర విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఏటీవో డా.జే.ఉషారాణి, ఆర్‌బీఎస్‌కే పీవో డా.మాధవినాయుడు, డీసీహెచ్‌ఎస్‌ డా.బీసీకే నాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. (Story : పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగులను నులిమేద్దాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version