UA-35385725-1 UA-35385725-1

తిరుమల పవిత్రత మంట కలిపిన పాపం ఎవరిది!?

తిరుమల పవిత్రత మంట కలిపిన పాపం ఎవరిది!?

నెయ్యి లో పశువుల కొవ్వు కల్తీ ఈనాటిదేనా..!?

లడ్డూలే కాదు.. స్వామివారికి ప్రసాదాల నివేదన, దీపారాధనలు అన్ని కల్తీ నెయ్యితోనే జరిగాయా!?

ఆలయంలో మహా సంప్రోక్షణ అవసరమా..!?

భక్తుల భావోద్వేగాలను రెచ్చగొట్టడం భావ్యమా..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రమైందంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. పవిత్రమైన వెంకన్న లడ్డు తయారీ అపవిత్రమైన మలినాలతో కలిసిన నెయ్యి తో తయారయిందని తెలుసుకొని కోట్లాదిమంది భక్తులు ఆవేదనతో గుండెలు బాదుకుంటున్నారు. భక్తితో తయారు చేసే లడ్డూలు, అన్నప్రసాదాలు ఆలయంలో వెలిగించే అఖండ దీపాలు అన్నింటికీ వాడే ఆవు నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, సోయాబీన్స్ తదితర కూరగాయలతో వచ్చే కొవ్వును కలిపి కల్తీ చేసిన నెయ్యిని ఇంతకాలం టీటీడీకి సరఫరా చేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా కంగు తిన్న శ్రీవారి భక్తులు శ్రీవారి ఆలయం మొత్తం అపవిత్రమైందని ఆవేదన చెందుతున్నారు. ఇందుకు కారకులైన గత వైసిపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో హిందూ దేవాలయమైన తిరుమలను బ్రష్టు పట్టించాలని వైసిపి ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడడంతో పాటు పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేస్తూ మలినాలతో కూడిన కల్తి నెయ్యిని వాడేలా దుర్మార్గమైన చర్యలకు పూనుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాపాల చర్యలకు పాల్పడిన అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ లు గా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో గా పని చేసిన ఏవీ ధర్మారెడ్డి లను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు ఉదృతమయ్యాయి. శ్రీవారికి పరమ భక్తులు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లోనే కాక మొత్తం భారత దేశవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ గా స్పందిస్తోంది. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థలు ఈ అంశాన్ని గట్టిగానే తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.

గత మూడు రోజులుగా సంచలనాత్మకంగా మారిన లడ్డు వ్యవహారం పై సుప్రీంకోర్టు సైతం వాజ్యాలు దాఖలయ్యాయి. హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి కుట్రపూరితమైన సంఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, నెయ్యి కల్తీలో నిజానిజాలను వెలికి తీయాలని, సాక్షాదారాలను న్యాయస్థానానికి సమర్పించాలని కోరుతూ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటి నుండి వెలువడిన కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని బిజెపి, కాంగ్రెస్ ఇతరత్రా అగ్ర నాయకులు కూడా లడ్డు వ్యవహారంపై నిగ్గు తేల్చాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కఠిన చర్యలకు పట్టుబడుతున్నారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన సెంటిమెంటుతో కూడిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై టిటిడి ప్రతిష్ట మసకబారడంతో పాటు సంస్థ పరువు బజారున పడినట్లు అయింది. దీన్ని సరిదిద్దుకునేందుకు
ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యినే తెప్పించుకునేలా తాజాగా చర్యలు చేపట్టిన టీటీడీ ఇంతకాలం జరిగిన అపవిత్రతకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలా లేక.. ఎలాంటి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలో.. అనీ టిటిడి ఉన్నతాధికారులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు, తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు.

అసలేం జరిగింది…ఎంత కాలంగా జరుగుతోంది.!?

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన లడ్డు ప్రసాదం తయారీ ప్రారంభమై 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకోసం తొలినాళ్ల నుంచి ఈనాటి వరకు పరిశీలిస్తే రోజుకు 14 టన్నుల నెయ్యిని లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాలు, దీపాలంకరణలకు టీటీడీ వినియోగిస్తోంది.‌ ఇందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలనే ప్రామాణికాన్ని తొలి నుంచీ పాటిస్తోంది. ఇందుకు అనుగుణంగానే వాడకం బాగా పెరిగిన తరువాత గత 20 ఏళ్లుగా దాదాపు 5 మంది సరఫరా దారుల నుండి నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తోంది. ఐదేళ్ల క్రితం వరకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నందిని డైరీ సంస్థ నుండి ఈ నెయ్యిని కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే రివర్స్ టెండర్ పేరుతో అప్పటిదాకా ఉన్న నందిని డైరీ, నెయ్యి సరఫరాదారులను తొలగించి వైసిపి పార్టీకి పెట్టుబడిదారులుగా కమీషన్లు అందించే బీనామీలుగా వ్యవహరిస్తున్న కొంతమంది ని నెయ్యి సరఫరాదారులుగా నియమించుకున్నారు. మార్కెట్లో ఉన్న ఆవు నెయ్యి ధరల కంటే తక్కువ ధరలో అంటే రూ 340 నుండి రూ 420 వరకు ధరల్లో టీటీడీకి అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి అప్పటికే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మార్కెట్లో 650 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూలన ఉన్న లోటు రాదు అనే విధంగా టిటిడి పాలక మండలి చైర్మన్లు టీటీడీ ఉన్నతాధికారి అంతా కుమ్ముక్కై కల్తీ నెయ్యిని టీటీడీకి యదేచ్చగా సరఫరా చేస్తూ వచ్చారు. అందులో గొడ్డు కొవ్వు పంది కొవ్వు, చేప నూనె, సోయాబీన్స్ తదితర కొన్ని వెజిటేబుల్స్ ద్వారా తయారయ్యే కొవ్వును ఆవు నెయ్యిలో కలిపి వేసి కల్తీ నెయ్యిని యదేచ్చగా ధార్మిక సంస్థకు సరఫరా చేస్తూ కోట్లాది రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా యదేచ్ఛగా తమ దుర్మార్గాన్ని కొనసాగించారు. స్వామి వారి ప్రసాదమైన లడ్డు పవిత్రతను మంట కలపడమే కాకుండా ధార్మిక సంస్థ ద్వారా కోట్లాది నిధులను దుర్వినియోగం చేసి అధికారికంగా భక్తుల సొమ్మును లూటీ చేశారు.‌

వాస్తవానికి టీటీడీ నిబంధనల ప్రకారం టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యిని కొన్ని రకాల పరీక్షల అనంతరం కానీ తిరుమలకు నెయ్యి ట్యాంకర్లను అనుమతించరు. టీటీడీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడల్లా వచ్చే లారీల టాంకర్లను తిరుపతిలోనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం తిరుమలకు అనుమతించాలి. ఇక్కడే సరఫరాదారులు అధికారులను మేనేజ్ చేసి ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని కాకుండా పరిశీలన కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న చిన్న డబ్బాలలో నెయ్యిని నాణ్యత పరీక్షల కోసం అందించేవారు. వాటిని ట్యాంకర్లలో ఉన్న నెయ్యిగా నమ్మించేవారు. అందులో నాణ్యతను పరిశీలించిన ల్యాబ్ అధికారులకు నాణ్యతగా ఉందని నిర్ధారణ అయితే అనుమతించేవారు. లేదంటే నాణ్యత లేదని తిప్పి వెనక్కు ట్యాంకర్లను పంపించేసేవారు. ఈ విధానం ఇప్పుడే కాదు దాదాపు 20 ఏళ్లుగా అనుసరిస్తున్నదే. మరో ప్రధానమైన లోపం ఏమిటంటే టీటీడీకి సరఫరా అవుతున్న ఆవు నెయ్యిని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించే ఆత్యాధునిక లేబరేటరీ టిటిడి కి ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇప్పుడు ఉన్నదల్లా కేవలం కొన్ని రకాలైన పరీక్షలకు మాత్రమే అనుమతించే పరిశోధన శాల మాత్రమే. అది కూడా ప్రైవేటు పరిశోధన కేంద్రాల్లో పరిశీలించినప్పటికీ కూడా కొన్ని విధాలైన ప్రామాణిక అంశాలు మాత్రమే వెళ్ళడవుతాయి. అంతేకానీ అత్యంత లోతుగా ఆవు నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె లాంటి మాంసకృతులు ఉన్నట్లు వెల్లడించే స్థాయిలో అధునాతనమైన నాణ్యత పరిశోధన శాలలు తిరుపతిలోనే కాదు దాదాపు మన రాష్ట్రంలో ఎక్కడ లేకపోవడం ప్రత్యేకంగా గమనార్హం. సరిగ్గా ఈ లోపభూయిష్టంగా ఉన్న విధానాన్నే అక్రమార్కులు వైసీపీకి కొమ్ము కాసిన కాంట్రాక్టర్లు చక్కగా వినియోగించుకున్నారు. వారు కల్తీ చేసిన నెయ్యిని నాణ్యత ప్రమాణాల పరీక్షల్లో సైతం కనిపించకుండా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. దీంతో వైసిపి ప్రభుత్వం చేసిన పాపం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.

ఎలా బయటపడింది అంటే….

ఎప్పుడైతే కల్తీ నెయ్యి వాడకాన్ని శ్రీవారి లడ్డూలకు వినియోగించారో అప్పటినుండి అంటే దాదాపు ఆరేళ్ల నుండి శ్రీవారి లడ్డూల రుచి లేకుండా నాణ్యత మరింత దిగజారిపోయిందని భక్తుల నుండి ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీటిపై వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు అధికారుల ద్వారా పరిపాలన సాగించి ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా జూన్ 12న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం వెంటనే రాష్ట్రంలో వైసిపి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతామని రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన చేపడుతామని ఇది ధార్మిక సంస్థ అయిన టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే టీటీడీకి ఈవోగా శ్యామల రావును నియమించారు. ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాల నాణ్యత పై దృష్టి సారించారు. ముఖ్యంగా నాణ్యతలేని నెయ్యి వాడకం కారణంగానే లడ్డు ప్రసాదాల నాణ్యత పూర్తిగా దెబ్బతినిందని గుర్తించారు. వెంటనే నెయ్యి సరఫరాదారుల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో తమిళనాడుకు చెందిన ఏ ఆర్ ఫుడ్స్ డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి పూర్తిగా కల్తీ అవుతున్నట్లు కనుగొన్నారు. వెంటనే ఆ కల్తీ నెయ్యిని నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేకంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గుజరాత్ లోని ఎన్ డి డి బి పరిశోధన శాలకు నాణ్యత ప్రమాణ పరీక్షల కోసం పంపించారు. దీనిపై ఎన్ డి డి బి సంస్థ జూలై 21వ తేదీన రిపోర్ట్ విడుదల చేసింది. పరిశోధన జరిపిన ఆవు నెయ్యిలో కల్తీ శాతాన్ని నిర్ధారిస్తూ, వాస్తవానికి ఉండాల్సిన స్థాయి కంటే కల్తీ ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తూ, ఇలా ఉండడానికి కారణం పంది కొవ్వు గాని, గొడ్డు కొవ్వు, చేప నూనె, వెజిటేబుల్ ఆమ్లాలు, కల్తీ జరిగి ఉండవచ్చనే సందేహాన్ని ఆ రిపోర్టులో వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అప్పట్లోనే టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి కల్తీ కారణంగానే కొన్ని నెయ్యి ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపడం జరిగిందని, ఇందుకు ప్రత్యామ్నాయంగా నాణ్యత ప్రమాణాలు గల ఆవు నెయ్యిని కర్ణాటక రాష్ట్రం నందిని డైరీ నుండి తిరిగి తెప్పించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అప్పటినుండి దృష్టి సారించిన శ్యామలరావు లడ్డు ప్రసాదాల నాణ్యతను, అన్న ప్రసాదాల నాణ్యతను కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి భక్తుల చేత పరవాలేదు అనిపించారు. ఇవన్నీ ఇలా ఉంచితే…

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి వందరోజులు పూర్తయిన సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి ఒక సమావేశంలో అనాలోచితంగా మాట్లాడుతూ… జగన్ పాలనపై విమర్శలు చేస్తూ.. ఆఖరికి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల ను కూడా బ్రష్టు పట్టించారు అంటూ… భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ చేసిన వినియోగించి అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, తదితర మలినాలు కలిపిన నెయ్యిని వాడి కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా మారింది. వాస్తవానికి నెయ్యి కల్తీ జరిగినట్లు రెండు నెలల క్రితమే తేలినప్పటికీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహించారు… టిటిడి అధికారులు కూడా వివరణాత్మకంగా ఎందుకు తెలియజేయ లేకపోయారు. అన్న సందేహాలు కలుగుతున్నాయి.‌
టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, శ్రీవారి భక్తులు అందరూ ఆశ్చర్యచకితులు అయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకిలా ముందు వెనుక ఆలోచించకుండా ఇలా మాట్లాడారో..? అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి ఆయన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి రాజకీయంగా సమాధి కట్టేందుకు ఎన్నో అవకాశాలు ఎన్నో సంఘటనలు కళ్ళు ఎదురుగా ఉన్నప్పటికీ., అవన్నీ పక్కన పెట్టి తిరుమలను కేంద్రంగా చేసుకొని భక్తుల సెంటిమెంటును, సున్నితమైన అంశాన్ని రాజకీయంగా తెరమీదకి తీసుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే మతపరంగా వైఎస్ జగన్ కు వ్యతిరేక పరిస్థితి తీసుకొచ్చేందుకు ఇంతటి కుటిలమైన రాజకీయాలకు తెర లేపడం ఎందుకనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరమైందో వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియకపోవచ్చు కానీ చంద్రబాబుకు మాత్రం తెలియదని అనుకోవడం లేదు. (Story: తిరుమల పవిత్రత మంట కలిపిన పాపం ఎవరిది!?)

(సౌజ‌న్యం: కోలా లక్ష్మీపతి, ఎడిట‌ర్, మాయావి పత్రిక)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1