Home ఆధ్యాత్మికం తిరుమ‌ల‌ ల‌డ్డూ అప‌విత్ర‌త‌పై దుమారం!

తిరుమ‌ల‌ ల‌డ్డూ అప‌విత్ర‌త‌పై దుమారం!

0

తిరుమ‌ల‌ ల‌డ్డూ అప‌విత్ర‌త‌పై దుమారం!

వైసీపీ హ‌యాంలో ల‌డ్డూలో అప‌విత్ర ప‌దార్థాల క‌ల‌యిక‌

సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై క‌ల‌క‌లం

సీబీఐ విచార‌ణ‌కు ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: తిరుమ‌ల ల‌డ్డూ అప‌విత్రమైందంటూ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగింది. సీఎం వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి 100 రోజులైనా ఇప్ప‌టివ‌ర‌కూ టీటీడీపై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా దుయ్య‌బ‌ట్టింది. టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్ర‌వారంనాడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. వైసీపీ హ‌యాంలో ల‌డ్డూ త‌యారీలో అప‌విత్ర ప‌దార్థాలు వాడారంటూ ఆయ‌న ఆరోపించారు. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈఓకి ఆదేశం జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామ‌ని సిఎం హెచ్చ‌రించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంద‌న్నారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సిఎం అన్నారు.
ఇదిలాఉండ‌గా, చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై  దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతినీచంగా, తన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చంద్రబాబు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తాను, భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చానని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వెంకటేశ్వర స్వామిపై అత్యంత నమ్మకం ఉన్న హిందువుగా.. తన హయాంలో టీటీడీలో ఎలాంటి అపచారాలు, అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదని, ఆ స్వామి వారి పాదాల చెంత కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుబ్బారెడ్డి ప్రకటించారు. మరి దారుణ ఆరోపణలు చేసిన చంద్రబాబు కూడా, తన కుటుంబ సభ్యులతో అదే ప్రమాణానికి సిద్ధమా? అని ఆయన సవాల్‌ చేశారు. తాను మోపిన నిందకు చంద్రబాబు కట్టుబడి ఉంటే స్వామివారి పాదాల చెంత ప్రమాణానికి ముందుకు రావాలని స్పష్టం చేశారు. లేదంటే భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు కచ్చితంగా చట్టపరమైన చర్యల దిశగా పోరాటం చేస్తామని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు.
మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై మాట్లాడుతూ, చంద్రబాబు తిరుమల లడ్డుపై బాంబ్ పేల్చార‌ని వ్యాఖ్యానించారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉంద‌న్నారు. ఇది చిన్న విషయం కాదని, జులై 12 న శాంపిల్స్ తీశారని, ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్ వేన‌ని తెలిసిన‌ప్పుడు జాప్యం ఎందుకు జ‌రిగింద‌న్నారు.  ఆ శాంపిల్స్ లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింద‌ని, ఇది సెంటిమెంట్ కి సంబంధించిన విషయమ‌ని ఆరోపించారు. దీనిపై దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఆందోళనలో ఉన్నార‌ని, భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్నికళ్ళకు అద్దుకుని తీసుకుంటార‌ని, అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశార‌ని,  ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్ గా తీసుకున్నార‌ని చంద్రబాబు ను అడుగుతున్నామ‌న్నారు. ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని ప్ర‌శ్నించారు. సివియారిటీ బాబు కి ముందే తెలుసా ? – తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు?  జులై 23న రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు? మీ 100 రోజుల పాలన సమావేశంలో ఎందుకు చెప్పారు? అని నిల‌దీశారు. మీ 100 రోజుల పాలన పై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని, ఈ విషయాన్ని గమనించి  ఇష్యు దైవర్ట్ చేశారా? అని ప్ర‌శ్నించారు.  తిరుమల లడ్డూ కల్తీ పై CBI విచారణ జరగాల‌ని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ పై మేము గవర్నర్ ను కలుస్తామ‌ని ష‌ర్మిల తెలిపారు. (Story: తిరుమ‌ల‌ ల‌డ్డూ అప‌విత్ర‌త‌పై దుమారం!)
The News In YouTube (వీడియో చూడండి!)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version