పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-
ఎమ్మెల్యే బోండా
స్వభావం, సంస్కారాల్లో స్వచ్ఛత ఉండాలి
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ
స్వచ్ఛతతోనే ఆరోగ్యం-వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : స్వచ్ఛభారత్ దిశగా అడుగు తరుణంలో, స్వచ్ఛ విజయవాడ వైపు మరో ముందడుగు వేస్తూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్2 వరకు జరిగే ‘‘స్వచ్ఛత హి సేవా’’ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం మంగళవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, స్వచ్ఛ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జీ.సమరం, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర తొలత స్వచ్ఛత హి సేవ పోస్టర్‌ను ఆవిష్కరించి బెలూన్లు విడుదల చేసి స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభ సంకల్పంతో మొదలైన స్వచ్ఛభారత్, ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌గా ఎంతో అందం పరిశుభ్రతగా మారిందన్నారు. ప్రతిరోజు మన ఇంటిని, పరిసరాలని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతకంటే ఎక్కువ పరిశుభ్రంగా మన విజయవాడను ఉంచాలన్నారు. మనిషికి మనిషికి ప్రాణవాయువునందించే మొక్కలు నాటడం ఒక అలవాటుగా చేసుకోవాలని ప్రతి ఇంట్లో, వీధిలో, స్కూల్లో మొక్కలు నాటుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మెలుగుతూ పరిశుభ్రత, పర్యావరణ రక్షణకు కృషి చేయాలన్నారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమాలను నగరపాలక సంస్థ నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ తన విభ్యాస సమయంలో చార్లెస్ నది ఒడ్డున ఒక మహిళ పెంపుడు కుక్కని తీసుకు వచ్చినప్పుడు అనుకోని పరిస్థితిలో అది మలవిసర్జన చేస్తే ఆ మహిళ అక్కడే వదిలేయకుండా దాన్ని పరిశుభ్రపర్చిన అనుభవాన్ని గుర్తు చేశారు. ఆ తరహాలోనే ప్రతి ఒక్కరూ తనంతటతానే పరిశుభ్రత పట్ల దృఢ సంకల్పంతో ఉండటంతో పాటు ప్రతి ఒక్కరూ స్వభావంలో, సంస్కారంలో స్వచ్ఛతగా ఉండాలని సూచించారు. వీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 2014న మహాత్మా గాంధీ శుభసంకల్పంతో స్వచ్ఛభారత్ మిషన్‌గా మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ నేటితో పదేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుందన్నారు. ఈ శుభ సందర్భంలో నగరపాలక సంస్థ ఈ పదేళ్ల ప్రయాణంలో స్వచ్ఛభారత్‌లో 3, 5, 6వ స్థానాలు కైవసం చేసుకుందని, ఇందుకు ప్రజలందరి సహకారమే కారణమన్నారు. నగరాన్ని మరింత అందంగా ఉంచేందుకు, అధిక శాతం మొక్కలు నాటటమే కాకుండా వ్యర్థాలను పరిశుభ్రపరిచేందుకు వాహనాలను పెంచినట్లు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛతను పాటించాలన్నారు. ఇల్లు, పరిసరరాలతో పాటు నివాస ప్రాంతాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలన్నారు. స్వచ్ఛత హి సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛభారత్‌లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు దృఢ సంకల్పంతోనే వీఎంసీకి సహకరించాలని పిలుపుననిచ్చారు. స్వచ్ఛత హి సేవలో పాల్గొనేందుకు వచ్చిన అతిదులు, విద్యార్ధులు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటటంతో పాటు స్వచ్ఛత హి సేవ అంటూ పరిసరాలను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీను ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ అడిషనల్ కమిషనర్ కేవీ.సత్యవతి, సీఎంహెచ్‌ఓ డాక్టర్ పీ.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ సృజన, డీసీపీ జూబిన్, ఏఎంహెచ్‌వోలు, జోనల్ కమిషనర్లు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, సీవీఆర్ లయన్స్ క్లబ్, డీబీఆర్‌సీ ఎన్జీవో, అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. (Story : పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-ఎఎ్మల్యే బోండా )