వడ్లమన్నాడు డ్రైనేజీ పరిశీలించిన జిల్లా కలెక్టర్
న్యూస్‌తెలుగు/వడ్లమన్నాడు:
గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు డ్రైనేజీని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి పరిశీలించారు.
జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు, ముంచెత్తిన వరదలతో పంట కాలువలతో పాటు డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వడ్లమన్నాడు వద్ద డ్రైనేజీని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
తమ పంట పొలాల్లోని నీరు డ్రైనేజీలోకి వెళ్లకపోగా ఎగదన్నుతోందని, మరోపక్క పంట కాలువలు పొంగి ప్రవహించి పంటచేలల్లోకి చేరి మునకన పడుతున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ ని కోరారు.
ఈ క్రమంలో వారు పొక్లెయిన్ తో డ్రైనేజీలోని గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులను పరిశీలించి అందుకు సంబంధించిన పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కౌతవరం పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్..
గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం పునరావాస కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి సందర్శించారు.
వారికి అందిస్తున్న భోజనం ఇతర సదుపాయాలను పునరావాస కేంద్రంలోని బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
పునరావాస కేంద్రంలో ఉండకుండా కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారని, శ్రమకోర్చి వారందరినీ తిరిగి సెంటర్కు తీసుకొస్తున్నామని అధికారులు కలెక్టర్కు వివరించారు.
మీ సంరక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని, అధికారులతో సహకరించి పరిస్థితులు సాధారణస్థితికి వచ్చేంతవరకు పునరావాస కేంద్రంలోనే సురక్షితంగా ఉండాలని కలెక్టర్, ఎంఎల్ఏ బాధితులకు సూచించారు. డ్రైనేజీ శాఖ, రెవెన్యూ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. (Story : వడ్లమన్నాడు డ్రైనేజీ పరిశీలించిన జిల్లా కలెక్టర్)