వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్
జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష
న్యూస్‌తెలుగు/విజయవాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి అన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రివర్యులు వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. (Story : వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్ )