క్రీడల్లో భాగస్వాములు కావాలి
ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి
5 కె రెడ్ రన్ ద్వారా హెచ్ఐవిపై అవగాహన
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ప్రతీఒక్కరూ క్రీడల పట్ల మక్కువ పెంచుకొని, వాటిలో భాగస్వాములు కావాలని విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు కోరారు. స్థానిక విజ్జీ స్టేడియం వద్ద విద్యార్ధులతో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ రెడ్ రన్‌ను ఆమె గురువారం ఉదయం ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, జిల్లా క్రీడాభివృధ్ది సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్యశాఖ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. యూత్‌ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలురు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ మూడు విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ప్రధమ బహుమతి క్రింద రూ.7,000, రెండో బహుమతి క్రింద రూ.4,000 అందజేస్తారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ అదితి మాట్లాడుతూ, క్రీడల్లో దేశం ఖ్యాతిని ఇనుమడింపజేసిన మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. క్రీడారంగంలో ధ్యాన్‌చంద్ చేసిన సేవలను కొనియాడారు. క్రీడలు ప్రతీఒక్కరికీ అవసరమని, ఆరోగ్యం కోసం క్రీడల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ రాణి, పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, విద్యార్దులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. (Story : క్రీడల్లో భాగస్వాములు కావాలి)