Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు భ‌ద్ర‌త త‌ప్ప‌నిస‌రి

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు భ‌ద్ర‌త త‌ప్ప‌నిస‌రి

0

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు భ‌ద్ర‌త త‌ప్ప‌నిస‌రి

ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అన్ని ప‌రిశ్ర‌మ‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాలి/ వారంరోజుల్లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త ఆడిట్ పూర్తిచేయాలి

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో మాక్ డ్రిల్ నిర్వ‌హించాలి/ ఉద్యోగుల భ‌ద్ర‌తపై యాజమాన్యాలదే బాధ్య‌త‌

ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌కు స్ప‌ష్టంచేసిన జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌

ప్ర‌తి సంస్థ‌కు విప‌త్తుల‌ను ఎదుర్కొనే ప్ర‌ణాళిక‌లు వుండాలి : ఎస్‌.పి. వ‌కుల్ జిందాల్‌

జిల్లా స్థాయి భ‌ద్ర‌త చ‌ర్య‌ల క‌మిటీ భేటీ

న్యూస్‌తెలుగు /విజ‌య‌న‌గ‌రం : జిల్లాలో అన్ని పరిశ్ర‌మ‌లు త‌మ సంస్థ‌ల్లో భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు ఆయా భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను వారం రోజుల్లోగా పూర్తిచేసి అంత‌ర్గ‌త ఆడిట్ నివేదిక‌ను అంద‌జేయాల‌ని ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌కు స్ప‌ష్టంచేశారు. జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌ల్లో చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై స‌మీక్షించేందుకు ఆయా పారిశ్రామిక యాజ‌మాన్యాల‌తో కూడిన‌ జిల్లా స్థాయి క్రైసెస్ మేనేజ్‌మెంట్ గ్రూపు స‌మావేశం ఫ్యాక్ట‌రీల త‌నిఖీ శాఖ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా.అంబేద్క‌ర్ మాట్లాడుతూ అంత‌ర్గ‌త ఆడిట్ పూర్త‌యిన‌ట్లు తెలియ‌జేస్తే ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌ను జిల్లా స్థాయి అధికారులు, నిపుణుల‌తో కూడిన క‌మిటీలు త‌నిఖీ చేసి భ‌ద్ర‌త‌కు నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌దీ లేనిదీ నిర్ధారిస్తాయ‌ని పేర్కొన్నారు.

ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద‌త్ర చ‌ర్య‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నేడు అత్య‌వ‌స‌రంగా యీ స‌మావేశం ఏర్పాటు చేశామ‌న్నారు. జిల్లాలోని అన్ని ప‌రిశ్ర‌మ‌లు భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతోపాటు భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై మాక్ డ్రిల్ నిర్వ‌హించి ఏవైనా ఘ‌ట‌న‌లు, ప్ర‌మాదాలు జ‌రిగిన‌పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ప్ర‌తి ప‌రిశ్ర‌మ త‌మ సంస్థలో ప‌నిచేసే ఉద్యోగులు, కార్మికుల భ‌ద్ర‌త‌ను కూడా అత్యంత ప్రాధాన్య‌త అంశంగా భావించి ఆమేర‌కు ఉద్యోగుల్లోనూ భ‌ద్ర‌త ప‌రంగా తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌పై త‌గిన అవగాహ‌న క‌లిగించాల‌న్నారు. జిల్లాలోని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో త‌ర‌చుగా త‌నిఖీలు నిర్వ‌హిస్తూ ఆయా ప‌రిశ్ర‌మ‌లు నిర్దేశిత ప్ర‌మాణాల ప్ర‌కారం భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌డుతున్న‌దీ లేనిదీ నిర్ధారించుకోవాల‌న్నారు. ఆయా ఫ్యాక్ట‌రీల ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు కూడా భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

జిల్లా పోలీసు సూప‌రింటెండెంట్ వ‌కుల్ జిందాల్ మాట్లాడుతూ ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కూ ఏదైనా ప్ర‌మాదం లేదా విప‌త్తు జ‌రిగిన‌పుడు త‌క్ష‌ణం ఎలా స్పందించాలి, ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే అంశంపై ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక వుండాల‌ని జిల్లా పోలీసు సూప‌రింటెండెట్ వ‌కుల్ జిందాల్ చెప్పారు. అన్ని ప‌రిశ్ర‌మ‌లు అన్నిర‌కాల భ‌ద్ర‌త ప్ర‌మాణాలు పాటించాల‌ని అందులో రాజీలేద‌ని స్ప‌ష్టంచేశారు. ప్ర‌మాదాలు లేని జిల్లాగా రూపొందించ‌డంలో అన్ని ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ప‌రిశ్ర‌మ‌లు త‌మ వ‌ద్ద వున్న భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌ను పునఃస‌మీక్షించుకోవాల‌ని, అవి ప్ర‌స్తుత ప‌రిస్ధితుల‌ను ఎదుర్కొనేందుకు త‌గిన‌విధంగా వున్నాయా లేదా అనే అంశాన్ని ప‌రిశీలించి అప్‌గ్రేడ్ చేసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ కోరారు. త‌మ ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌మాదాలు జ‌రిగేందుకు ఆస్కారం వున్న విభాగాల‌ను గుర్తించి వాటి ప‌నితీరు, నిర్వ‌హ‌ణ‌పై నిత్యం నిఘా పెట్టాల‌న్నారు. ప్ర‌తి సంస్థ భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌కు సంబంధించి ఒక సేఫ్టీ సూప‌ర్ వైజ‌ర్‌ను నియ‌మించుకోవాల‌ని సూచించారు. ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు నిల్వ చేసే ట్యాంకులు ఏవైనావుంటే వాటిని త‌ర‌చుగా గ‌మ‌నించాల‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎలక్ట్రిక‌ల్ స‌ర్క్యూట్‌లు స‌క్ర‌మంగా వున్న‌దీ లేనిదీ నిత్యం త‌నిఖీలు చేస్తూ వుండాల‌న్నారు.

ఫ్యాక్ట‌రీల విభాగం డిప్యూటీ చీప్ ఇన్ స్పెక్ట‌ర్ సురేష్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు భారీ ప‌రిశ్ర‌మ‌లు వున్నాయ‌ని తెలిపారు. ఈ ప‌రిశ్ర‌మ‌ల్లో చేప‌ట్టిన భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై ఎస్‌.ఎం.ఎస్‌.ఫార్మా, హెచ్‌.బి.ఎల్‌., మైలాన్‌ సంస్థ‌ల ప్ర‌తినిధులు వివ‌రించారు. ఇటీవ‌లి కాలంలో త‌మ సంస్థ‌ల్లో ఎటువంటి భారీ ప్ర‌మాదాలు చోటు చేసుకోలేద‌ని వారు తెలిపారు.

ఈ సమావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ డి.డి. కోటేశ్వ‌ర‌రావు, ఆర్‌.డి.ఓ.లు ఎం.వి.సూర్య‌క‌ళ‌, బి.శాంతి, సుధారాణి, డిప్యూటీ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఇ.ఇ. స‌రిత‌, ఏపిఐఐసి అధికారులు ముర‌ళీమోహ‌న్‌, రామ‌కృష్ణ‌, అగ్నిమాప‌క అధికారులు, జిల్లాలోని వివిధ పారిశ్రామిక సంస్థ‌ల యాజ‌మాన్య ప్ర‌తినిదులు పాల్గొన్నారు. (Story : అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు భ‌ద్ర‌త త‌ప్ప‌నిస‌రి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version