సెప్టెంబర్ 5 లోగా కార్మికుల సమస్యల పరిష్కారం కాకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం
ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
న్యూస్‌తెలుగు /విజయనగరం :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజిలో పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల బతుకులు కాంట్రాక్టర్లు అనే దళారీల చేతుల్లో పెట్టడం వలన పెరిగిన వేతనాలు ఇవ్వకుండా, ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించకుండా వర్కర్స్ బ్రతుకులతో ఆడుకుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తీవ్రంగా మండిపడ్డారు.
మంగళవారం ఘోష,మహారాజా ఆసుపత్రుల వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు
ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ గత 3 నెలలుగా దశల వారీగా వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ హాస్పిటల్స్ కి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఇబ్బందులూ కలిగించకుండా పనులకి ఆటంకాలు కలిగించకుండా శాంతియుత పద్ధతిలో నిరసన ధర్నాలు చేస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న పాలకులకి, అధికారులకి కనీసం వర్కర్ల పట్ల కనికరం లేదా అని ప్రశ్నించారు. శ్రమకి తగిన జీతం లేక, ప్రతి నెల జీతాలు అందకపోవడం వలన ధరల భారాలను తట్టుకోలేక అప్పులపాలు అయ్యి వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికులు కష్టార్జితంలో దాచుకున్న పి.ఎఫ్ డబ్బులు కూడా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వకుండా ప్రతి నెల ఇ.ఎస్.ఐ డబ్బులు కూడా దోచుకున్నారని మండిపడ్డారు. శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ కి, సెక్యూరిటీ గార్డులకి, సూపర్వైజర్లు అందరికీ సెప్టెంబర్ 5 వ తేదీలోగా బకాయి ఉన్న అన్ని నెలల జీతాలు చెల్లించాలని, జీ. ఓ ల ప్రకారం జీతాలు పెంచాలన్నారు.2021 జూన్ నెల నుంచి రావాల్సిన వేతనానికి తగిన పి.ఎఫ్ డబ్బులు మొత్తం లెక్కలు చెప్పు జమ చేసి, ఇ.ఎస్.ఐ కార్డులు ఇవ్వకుండా ప్రతి నెల ఇ.ఎస్.ఐ పేరుతో వేతనంలో కట్ చేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ కి, సెక్యూరిటీ గార్డులకి, సూపర్వైజర్లు అందరికీ చెల్లించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే సెప్టెంబర్ 5 తరువాత నుంచి ఆమరణ నిరహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం మహారాజా, ఘోష ఆసుపత్రుల్లో వర్కర్స్ పాల్గొన్నారు. (Story : సెప్టెంబర్ 5 లోగా కార్మికుల సమస్యల పరిష్కారం కాకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం )