డబుల్ బెడ్రూం కాలనీ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం
వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూం కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ నీళ్లు ఒకటవ బ్లాక్ నుండి తొమ్మిదవ బ్లాక్ వరకే వస్తున్నాయని, మిగతా 18 బ్లాకులకు మంచినీటి సౌకర్యం లేదని వారి దృష్టికి తెచ్చారు. కాలనీలో వీధిలైట్లు లేక చీకటి మయంగా మారిందని, దీంతో పాములు, తేళ్లు, విష సర్పాలతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు. శ్రీ చైతన్య స్కూల్ నుండి మూడవ బ్లాక్ వరకు ప్రధాన రహదారిని మరమ్మతు పనులు చేయాలని, కాలనీలోని అంతర్గతంగా ఉన్న రోడ్లకు సీసీ రోడ్లు వేయాలని కోరారు. ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరిగి విష సర్పాలకు నిలయంగా మారిందని, పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని కోరారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించిందని చెప్పారు. కాలనీలో సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయకుండా మరిచిపోయారని, దీంతో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తెచ్చారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంటనే డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు దృష్టికి తేవాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు కాలనీవాసులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యులు ఎండి.మునీరుద్దీన్, సర్దార్ ఖాన్, మండ్ల రాజు, ఎండి.నిరంజన్, వనగంటి రమేష్, రవికుమార్ చారి, వినోద్ చారి, ఖాజా, నరసింహ, రియాజ్, గిరి, వెంకటేష్, శ్రీను, రాజేశ్వరి, విష్ణు, శేఖర్ గౌడ్, మహమ్మద్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. (Story : డబుల్ బెడ్రూం కాలనీ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం)