అక్టోబర్ 15న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం
రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతర మహోత్సవాలు
అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు : ఇ.ఓ. వెల్లడి
న్యూస్‌తెలుగు /విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.వి.వి.ప్రసాదరావు వెల్లడించారు. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 30వ తేదీన వనం గుడి వద్ద ఉదయం 8 గంటలకు నిర్వహించే చండీ హోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణతో ఉత్సవాలు ముగియ నున్నాయని పేర్కొన్నారు.తోలేళ్ల ఉత్సవం అక్టోబర్ 14వ తేదీ సోమవారం, ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం జరుగుతాయని తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల వివరాలను మంగళవారం ఆయన ఇక్కడ అన్నప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలసి మీడియాకు వివరించారు. అమ్మవారి అర్ధ మండల దీక్షలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 22న పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తామని, 29న ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 27న కలశ జ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద నుండి జరుగుతుందని తెలిపారు.
పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం 2019లోనే గుర్తించి ప్రకటించిందని, దీనిపై జి.ఓ. నెం. 108 జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుందని, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.* *అమ్మవారి జాతర ఉత్సవాల గురించి ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతి రాజు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ లకు ఇప్పటికే తెలియజేశామని వెల్లడించారు. ప్రభుత్వం తరపున ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేయాలని కోరామని చెప్పారు.
అమ్మవారి జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఇ.ఓ. చెప్పారు. ఉత్సవాల నిర్వహణపై త్వరలోనే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించు కునేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడుతూ దసరా ముగిసిన వెంటనే వచ్చే మంగళ వరం అమ్మవారి సిరిమాను జాతర నిర్వహించడం సంప్రదాయం గా వస్తోందని ఆ ప్రకారమే ఈ ఏడాది జాతర తేదీలను నిర్ణయించామని చెప్పారు. జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారని భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. తాను వరుసగా ఎనిమిదో ఏడాది సిరిమాను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. (Story : అక్టోబర్ 15న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం)