వైసీపీ అక్రమాలకు నిదర్శనం వరస ఫైళ్ల దహనం
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో అయిదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు నిదర్శనమే వరస ఫైళ్ల దహనం అని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక దస్త్రాల కాల్చివేత నుంచి ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాల దహనం వరకు ముమ్మాటికీ వైసీపీ కుట్రలు దాగి ఉన్నాయని, గత పాపాలకు సాక్ష్యాధారాలు దొరక్కుండా చేయాలనే ఇలా బరి తెగిస్తున్నారని మండిపడ్డారాయన. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలు తగలబెట్టేస్తుండడంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత శాఖల మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఫైళ్లు కాల్చినంత మాత్రాన చేసిన తప్పులు మాయమైపోతాయి అనుకుంటే అది వైసీపీ నేతల భ్రమే అని దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కాగితాలకు సంబంధించి భూ వ్యవహారాల్లో వారి దారుణాలు వెలుగుచూడకూడదనే వైసీపీ పెద్దలు, వారికి ఇంకా కొమ్ముకాస్తున్న కొందరు అధికారులు కూడగల్పుకుని చేసినట్లు కనిపిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలకు సంబంధించిన భూ పరిహారాల్లో వైసీపీ నేతలు బందిపోట్లలా దోచేశారని, నకిలీ రైతుల పేరిట రూ.కోట్లు దండుకున్నారని వాటన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో తప్పక బయట పెడతామన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర్నుంచి ఇలానే ప్రతిశాఖలో ఆధారాలు, ఫైళ్లు ధ్వంసం చేయాలని జరుగుతున్న కుతంత్రాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు జీవీ. ఫైళ్ల ధ్వంసంలో ప్రమేయమున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పటిష్ఠ నిఘా, భద్రత ఏర్పాటు చేయాలి, అంతర్గత విచారణల మేరకు అనుమానమున్న వాళ్లను ముందస్తు నిర్భంధాల్లో ఉంచాలి, మాజీ మంత్రులు సహా ఏ స్థాయి వ్యక్తులున్నా చట్టం ముందు నిలబెట్టాలి, ఇప్పటి వరకు జరిగిన ఫైళ్ల దహనం కేసులన్నింటినీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే ఆంజనేయులు. (Story : వైసీపీ అక్రమాలకు నిదర్శనం వరస ఫైళ్ల దహనం)