రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శిశోడియా విస్తృత పర్యటన
తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల తనిఖీ
భోగాపురంలో పలు గ్రామాలు సందర్శన
న్యూస్‌తెలుగు/విజయనగరం : రాష్ట్ర రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.శిశోడియా జిల్లాలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. భోగాపురం, ఎస్.కోట, వేపాడ మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. భూరికార్డులను పరిశీలించి భూముల వర్గీకరణపై వివిధ ప్రభుత్వ శాఖల వద్ద రికార్డుల్లో తేడాలు వుండటాన్ని గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఆర్.డి.ఓ.లు, తహశీల్దార్‌లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై 22ఏ కేటగిరీ భూములు, ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్, భూముల రీసర్వే అనంతరం తలెత్తిన పరిస్థితులు, గృహనిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. భూముల వర్గీకరణ విషయంలో రానున్న రోజుల్లో తహశీల్దార్ వద్ద, రిజిష్ట్రార్‌ల వద్ద రికార్డులు ఒకేలా నమోదై వుండాలని స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి భూ సమస్యలపై వినతులు స్వీకరించారు.
జిల్లా పర్యటన నిమిత్తం ఉదయం భోగాపురం మండలం పోలిపల్లి నిర్వాసితుల పునరావాస కాలనీకి చేరుకున్న రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకొని గ్రామ రెవిన్యూ రికార్డులను పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి భూముల క్రయవిక్రయాలపై సమాచారం సేకరించారు. అనంతరం భోగాపురంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను సందర్శించి భూములకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు.
బసవపాలెం చేరుకొని అక్కడ గ్రామస్థులతో మాట్లాడి భూసర్వే జరిగిన తీరుపై ఆరా తీశారు. భూముల సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకాలు ఎవరికైనా అందాయా, భూహక్కు పత్రాలు ఇచ్చారా లేదా అనే అంశంపై మాట్లాడారు. ఎవరివద్దయినా పాస్‌పుస్తకాలు వుంటే చూపించాలని కోరారు. గ్రామంలోని రెవిన్యూ రికార్డుల్లో వున్న పలువురు భూయజమానుల పేర్లు చదివి వినిపించి వారి భూముల్లో ఎవరు సాగు చేస్తున్నారు, ఏయే పంటలు సాగు చేస్తున్నారని ఆరా తీశారు. గ్రామంలోని భూరికార్డులను పరిశీలించారు.
జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్‌లు, సబ్ రిజిష్ట్రార్‌లతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూసమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం ఎస్.కోట, వేపాడ మండలాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఈ పర్యటనలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెంట జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ, జిల్లా రిజిష్ట్రార్ కుమారి తదితరులు పాల్గొన్నారు. (Story : రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శిశోడియా విస్తృత పర్యటన)