గంజాయి కేసుల్లో నిందితులపై సస్పెక్ట్ షీటు తెరుస్తాం
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఆర్.సి.ఎం. స్కూలు వెనుక గల బరియల్ గ్రౌండులో కొంతమంది వ్యక్తులు వద్ద గంజాయి కలదని వచ్చిన సమాచారంతో బొబ్బిలి సిఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆగస్టు 16న రైడ్ చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణ, అమ్మకాలు, వినియోగం చేపడుతున్న వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు చేసి, నిందితులను అరెస్టు చేసి, వారికి గంజాయిని ఎవరు సరఫరా చేస్తున్నది. ఎక్కడ నుండి కొనుగోలు చేస్తున్నది, ఎలా లభ్యమవుతున్నదనే విషయాలపై పోలీసు అధికారులు దృష్టి పెట్టి, ఆ దిశగా కేసుల దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి కేసుల్లో పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించే వారిని, చిన్న మొత్తంలో విక్రయించే పెడ్లర్స్ ను గుర్తించి, పట్టుబడిన నిందితుల నుండి సమాచారాన్ని రాబడుతున్నారు. ఆగస్టు 16న బొబ్బిలి సిఐ ఎం.నాగేశ్వరరావుకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు పోలీసు బృందం బొబ్బిలి పట్టణంలోని ఆర్.సి.ఎం. స్కూలు వెనుక భాగంలోగల బరియల్ గ్రౌండు వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న 8మంది వ్యక్తులు పోలీసులను చూసి, వరాఠీ అయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా నాగలాపురంకు చెందిన (ఎ-1) నాగలాపురం లోహిత్ అలియాస్ లోహిత్ భరత్ (25 సం.లు) అనే వ్యక్తి (ఎ-2) బొబ్బిలి పట్టణంకు చెందిన చింతాడ సారధి అలియాస్ నాని (40సం. లు) అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చారన్నారు. (ఎ-1) లోహిత్ భరత్ వద్ద నుండి ఆరు కిలోలు, ఎ-2 చింతాడ సారధి అలియాస్ నాని వద్ద నుండి నాలుగు కిలోల గంజాయిని బొబ్బిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. (ఎ-3) బొబ్బిలి పట్టణంకు చెందిన సిమిడి ప్రేమ్ కుమార్ (18సం.లు) (ఎ-4) బొబ్బిలి పట్టణంకు చెందిన లంక విఖిల్ (26 సం.లు) (ఎ-5) బొబ్బిలి పట్టణంకు చెందిన దేవుపల్లి చందన్ అలియాస్ లంజూ (19 సం.లు) అనే వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రం నుండి వేరు వేరు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి, తీసుకొని వచ్చి,(ఎ-2) చింతాడ సారధి అలియాస్ నానికి అందజేసి, గంజాయి వ్యాపారంలో సహాయపడే వారని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరితోపాటు ముగ్గురు జువినల్స్ కూడా అక్రమంగా గంజాయి తరలించుటలో సహకరించే వారని, వారిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టుబడిన మిగిలిన నిందితుల వద్ద నుండి మరో ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. (ఎ-1) లోహిత్ భరత్ పై ఇప్పటికే పార్వతీపురం పట్టణం పిఎస్ లో గంజాయి కేసు నమోదైందన్నారు. ఇంకనూ ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు గురించి ఆరా తీసి, వారిని కూడా నిందితులుగా చేర్చుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి కేసుల్లో అరెస్టుకాబడిని నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, వారిపై నిఘా ఉంచుతామని, ఇదే తరహా నేరాలకు తరుచూ పాల్పడితే నిందితులపై పి.డి. యాక్ట్ కూడా పెడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో నమోదైన ప్రతీ కేసును సమీక్షించి, వాటిలో ప్రధాన సూత్రదారులను గుర్తించి, వారిని కూడా ఆయా గంజాయి కేసుల్లో నిందితులుగా చేర్చి, వారిని అరెస్టు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఇటీవల విజయనగరం 2వ పట్టణం, 1వ పట్టణ పిఎస్ ల్లో నమోదైన గంజాయి కేసుల్లో కూడా గంజాయి లింకులను చేధించి, నిందితులను అరెస్టు చేసామని తెలిపారు.ఈ సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, బొబ్బిలి సర్కిల్ ఇన్చార్జ్ సిఐ ఎం. నాగేశ్వరరావు, ఎస్బీసిఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : గంజాయి కేసుల్లో నిందితులపై సస్పెక్ట్ షీటు తెరుస్తాం)